ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
posted on: Feb 7, 2026 7:23PM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన వెన్యూ కారు అదుపుతప్పి రింగ్ రోడ్డుపై నుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాచుపల్లి వైపు వెళ్తున్న వెన్యూ కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.
పోచారం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే కారు అతివేగంతో ప్రయాణించ డంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రింగ్ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొడుతూ కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపో యింది.ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఒక పురుషుడు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా పటాన్‌చెరు ధ్రువ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి కూడా గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద ఘటనతో ఔటర్ రింగ్ రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధ రించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుని వేగ నియంత్రణ చేపట్టాలని కోరుతున్నారు.






