రేవంత్‌రెడ్డికి బెయిల్ ఖాయమా?
posted on Jun 26, 2015 9:47PM

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డికి రెండుసార్లు రిమాండ్ విధించారు. ఆయనకు రిమాండ్ కొనసాగించేలా చేయాలన్న ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం వుంది. ఈమేరకు రేవంత్ రెడ్డిని ఇంకా విచారించాల్సి వుందని, దానితోపాటు రేవంత్ రెడ్డి బయటకి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం వుందని చెబుతూ వస్తోంది. శుక్రవారం నాడు కోర్టు ముందుకు విచారణకు వచ్చిన ఈ కేసులో వాదోపవాదాలు, న్యాయమూర్తులు చేసిన కామెంట్లను చూస్తుంటే రేవంత్ రెడ్డికి బెయిల్ లభించడం ఖాయమని అనిపిస్తోంది. రెండు పక్షాల వారి వాదనలను విన్న తర్వాత న్యాయమూర్తి ఈ కేసును మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం నాడు ఆయనకు నూటికి నూరుశాతం బెయిల్ లభించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నమ్మకాన్నే రేవంత్ రెడ్డి న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల ఆయన ఈ కేసును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి ఆయన కేసు మీద ఎలా ప్రభావాన్ని చూపుతారని ప్రశ్నించారు. నెల రోజులుగా పోలీసుల అదుపులోవున్న రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు ఏమి విచారించారు? ఇంకా జైలులో వుంచి ఏమి విచారించబోతున్నారన్న ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వ లాయర్ల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేని ఇంతకాలం రిమాండ్‌లో వుంచడం భావ్యంకాదని, బెయిల్ దొరకనివ్వకుండా అడ్డు పడటం న్యాయం కాదని ఆయన తరఫు న్యాయవాదులు సమర్థంగా వాదించినట్టు తెలుస్తోంది. ఈ వాదనల అనంతరం కేసు మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం నాడు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారని తెలుస్తోంది.