రేవంత్ కేసు నిలబడుతుందా?

posted on: Jun 5, 2015 7:53AM

 

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయి, అభిమన్యుడి పరిస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి చర్లపల్లి కారాగారంలో వున్నారు. కొంతమంది ఈ కేసు విషయంలో ఏదేదో జరిగిపోతుందని భావిస్తున్నప్పటికీ, న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడేంత బలంగా లేదని భావిస్తున్నారు. ఇది తెలంగాణ తెలుగుదేశం వర్గాలకు ఊరట ఇస్తోంది. లంచం ఇవ్వజూపడం నేరం అయినప్పుడు  అలా లంచం ఇవ్వడానికి ప్రయత్నించేలా ప్రేరేపించడం కూడా నేరమే అవుతుందని, ఈ కేసు న్యాయస్థానాల ముందుకు వస్తే పథకం ప్రకారం లంచం అడిగిన స్టీఫె‌న్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ఎదురయ్యే అవకాశం వుందని అంటున్నారు.

అలాగే, అవినీతి అక్రమాలను బట్టబయలు చేసే ప్రయత్నమంటూ ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఆ వ్యవహారం మొత్తాన్నీ రహస్య కెమెరాలతో చిత్రీకరించడం (స్టింగ్ ఆపరేషన్) చట్ట సమ్మతమైన విధానం కాదగనం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే విధానంలో ఇరుక్కుపోయారు. మరి ఈ కేసు కోర్టు ముందు ఎంతవరకు నిలబడుతుందనేది సందేహమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్నప్పుడు కంపించిన తెలంగాణ తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు న్యాయ నిపుణుల క్లారిఫికేషన్‌తో స్థిమితపడ్డాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కేసును కోర్టు ముందుకు తీసుకువెళ్ళేలోపు పకడ్బందీ ఆధారాలతో సిద్దమవడానికి కసరత్తు చేస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...