Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ సంచలనం!
posted on: Jun 23, 2026 2:38PM

తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక రేవంత్ రెడ్డి అసమానమైన ధైర్యం, రాజకీయంపై ఉన్న అపారమైన పట్టు దాగి ఉన్నాయి. తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ రేవంత్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక రాజకీయ జ్ఞాని అని అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఢిల్లీ అధిష్ఠానం లేదా రాహుల్ గాంధీ పాత్ర కంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవ, వ్యూహాలే అత్యంత కీలక పాత్ర పోషించాయన్నారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు. కేసీఆర్ శైలిలోనే ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడి, వాటిలో అసలైన పేటెంట్ రైట్ తనదే అని నిరూపించుకున్నారు. ప్రజాకర్షణలో ఆయన చూపిన వేగం, చొరవ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ రాజకీయ సమరంలో కేవలం మాటలకే రేవంత్ రెడ్డి పరిమితం కాలేదు. ఆర్థిక వ్యూహాల్లోనూ, కుల సమీకరణాల్లోనూ ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. కేసీఆర్ ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు వ్యయం చేశారనేది పక్కన పెడితే.. రేవంత్ రెడ్డి అంతకంటే ఒక రూపాయి ఎక్కువే పెట్టి దీటుగా నిలబడ్డారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడిచింది. ఎన్నికల నిర్వహణలోనూ, వ్యూహాల అమలులోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఎంతో సీనియర్లయిన నాయకులు ఉన్నప్పటికీ, వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అద్భుతమైన విజయం సాధించారని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాధారణంగా కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. కానీ సీనియర్లందరి సహకారం తీసుకుని, వారిని ఒక జట్టుగా నడిపించి విజయం సాధించడమే రేవంత్ రెడ్డి అసలైన సక్సెస్ సీక్రెట్ అని చెప్పారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమీకరణాలు కూడా రేవంత్ రెడ్డి విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ కంపెనీల కబ్జాలు, ఆక్రమణలపై అక్కడి భూస్వాములు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం తీవ్ర ఆందోళన చెందింది. ఒకవేళ మళ్ళీ పాత ప్రభుత్వమే వస్తే తమ భూములు తాము కోరుకున్న ధరకు కాకుండా, వారు చెప్పిన ధరకే ఇచ్చుకోవాల్సి వస్తుందేమోననే భయం నెలకొంది. ఈ ఆందోళనతో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు, రెడ్డి సామాజిక వర్గ భూస్వాములు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. వీరంతా రేవంత్ రెడ్డికి అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ బలమైన శక్తుల కలయికే రేవంత్ రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చింది.
ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ వస్తున్న ఊహాగానాలలో ఎలాంటి నిజం లేదని డోలేంద్రప్రసాద్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారంఆర్ఎస్ఎస్ తో బలమైన సంబంధాలు లేని వారికి ఉన్నత పదవులు దక్కడం అసాధ్యమన్న డోలేంద్ర ప్రసాద్.. అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల మినహాయింపులు వేరన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరినా వారికి ఎలాంటి గుర్తింపు దక్కలేదనేదని ఉదహరించారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే అదే పరిస్థితి ఎదురవుతుందనీ, రేవంత్ అంతటి అమాయకుడు కాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ, ప్రత్యేక గుర్తింపు ఉన్నాయి. రాహుల్ గాంధీ సైతం ఆయన మాటను కాదనలేని స్థాయిలో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే తెలంగాణలో ఈ తిరుగులేని గెలుపు కేవలం రేవంత్ రెడ్డి సొంతమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
వాస్తవ వేదిక పూర్తి చర్చ తెలుగువన్ చానెల్ లో చూడండి



.webp)


