ఈ బెయిల్ ఊహించిందే


మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అధికార టీఆర్ఎస్‌ ముద్దు బిడ్డ అయిన ఏసీబీ రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎన్ని పాచికలు వేసినా పారలేదు. మంగళవారం నాడు హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తుందని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను విన్నప్పుడే అనిపించింది. హైకోర్టు మంగళవారి నాటికి ఈ కేసును వాయిదా వేసినప్పుడు, మంగళవారం నాడు రేవంత్‌కి బెయిల్ రావడం ఖాయమని అందరూ ఊహించారు. అధికారంలో వున్న టీఆర్ఎస్, టీఆర్ఎస్ అధీనంలో వున్న ఏసీబీ కూడా ఈ విషయాన్ని ఊహించే వుండవచ్చు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తన మెట్టు దిగలేదు. సోమవారం నాడు ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి రిమాండ్‌ని పొడిగించింది. సోమవారం నాడే ఏసీబీ కోర్డు రేవంత్ రెడ్డికి బెయిల్ఇచ్చి వుంటే దానికి కాస్తంత గౌరవం దక్కి వుండేది. ఇప్పుడు హైకోర్టు రేవంత్‌కి బెయిల్ మంజూరు చేయడం ఏసీబీకి, ఏసీబీ వెనుక వున్న ప్రభుత్వానికి తల కొట్టేసినట్టు వుండే విషయమేగా!

మంగళవారం నాడు హైకోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వ ఏజీ రేవంత్‌కి బెయిల్ రాకుండా చేయడానికి గత కొంతకాలంగా వినిపిస్తున్న వాదననే వినిపించారు. అయితే హైకోర్టు ఆ వాదనను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. న్యాయ ప్రకారం అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్న వెంటనే బెయిల్ ఇవ్వాల్సి వుంది. అయితే ఏసీబీ కోర్టు విచారణ అంటూ అదంటూ ఇదంటూ తాత్సారం చేసి నెల రోజులపాటు రేవంత్‌ని జైలులో వుంచింది. విచారణకు సహకరిస్తానని చెప్పినా జాలి లేకుండా ఆయన్ని సాధించింది. ఇప్పుడు నెలరోజుల తర్వాత కూడా కరుణ చూపకుండా ఆయన్ని ఇంకా కొంతకాలం జైల్లో వుంచడానికి ప్రయత్నించింది. ఏసీబీ వ్యవహరిస్తున్న ధోరణి రాజకీయ వర్గాలకు, ప్రజలకు ఎంతమాత్రం నచ్చలేదు. చివరకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి.