చేతులు కలిపిన రేవంత్, కిషన్ రెడ్డి!

posted on: Jun 23, 2026 11:16AM

 హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేందుకు రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ఇద్దరు కీలక నేతలు చేతులు కలిపారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక ఆసక్తికర పరిణామంలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఏక తాటిపైకి వచ్చారు. నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ  కలిసి కేంద్ర రైల్వే  మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.  దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా  సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.  
 
కొద్దిరోజుల కిందట..  హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (  ద్వారా సుమారు 13,600 కోట్ల రూపాయల రుణాన్ని   4 శాతం వడ్డీ రేటుతో రీఫైనాన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే..  మే 30 గడువు ముగిసిన తర్వాత ఐఆర్‌ఎఫ్‌సీ ఈ నిధుల విడుదలను నిలిపివేయడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీనిపై గత వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో  కేంద్రంపై మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి ఉద్దేశపూర్వకాంగా   నిధులను అడ్డుకుంటున్నారని బహిరంగ విమర్శలతో ధ్వజమెత్తారు.  అనంతరం  రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి రెండు బహిరంగ లేఖలు రాస్తూ, కిషన్ రెడ్డిని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి పిలుపునకు సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సోమవారం(జూన్ 22)  ఈ కీలక భేటీ  ఏర్పాటు చేశారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను, ఆర్బీఐ  అనుమతి పత్రాలను కేంద్ర మంత్రి ముందు ఉంచారు. ఒకవేళ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  అప్పు తీర్చలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. అంతే కాదు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుండి 1,400 కోట్ల రూపాయలను ఈ ప్రక్రియ కోసం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రుణ విడుదలలో ఆలస్యం జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వంపై, ఇటు ఐఆర్‌ఎఫ్‌సీపై అదనపు వడ్డీ భారం పడుతుందని రేవంత్ రెడ్డి వివరించారు.

ఈ చర్చల సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలకమైన సూచన చేశారు. సాధారణంగా ఐఆర్‌ఎఫ్‌సీ అనేది రైల్వే మౌలిక సదుపాయాలకే నిధులు ఇస్తుందని, మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయించేటప్పుడు పాత అవగాహనా ఒప్పందం  మరింత సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా వచ్చే ఆదాయంలో మొదటి వాటా ఐఆర్‌ఎఫ్‌సీ అప్పు చెల్లింపులకే వెళ్లేలా, ఆ తర్వాతే మిగిలిన నిధులను నిర్వహణకు వాడుకునేలా సరికొత్త ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది.

ఈ   సమస్యలు త్వరలోనే పరిష్కారమైతే, భాగ్యనగర భవిష్యత్తును మార్చబోయే మెట్రో ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమం అవుతుంది.   ఫేజ్-2 ప్రాజెక్టు కింద మొత్తం 7 కారిడార్లలో ఏకంగా 122.9 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని అంచనా వ్యయం  38 వేల 595 కోట్ల రూపాయలు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...