ఢిల్లీలో వైభవంగా రిపబ్లిక్ డే వేడుకలు

posted on: Jan 26, 2026 12:22PM

 

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ‘ప్రచండ్’ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యుద్ధవేషాలతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్‌లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా కవాతులో పాల్గొని అభినందనలు పొందింది.

ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సారి పరేడ్‌ ‘వందేమాతరం – 150 ఏళ్లు’ అనే థీమ్‌తో సాగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ప్రత్యేక గీతం ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.

రాష్ట్రపతి భవన్ నుంచి అధ్యక్షురాలు ముర్ముతో కలిసి ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సాంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారికి ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. అనంతరం కర్తవ్యపథ్ వేదికపై రాష్ట్రపతి ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా… జాతీయ గీతాలాపన జరిగింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’ను ప్రదానం చేశారు. భారత్‌ సొంతంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఎంపికైన మరో వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తి చక్ర’ను అందజేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...