అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త..!

posted on: Aug 8, 2026 5:37PM

 

రెంట్ బాయ్‌ఫ్రెండ్ వలలో పడొద్దు.. సైబరాబాద్ పోలీసులు కీలక సూచన..! 

ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!”.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇలాంటి ప్రకటనలు యువతులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి వెనుక అసలు కథ వేరే ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో జరుగుతున్న ఈ ఆన్‌లైన్ మోసం బారిన పడితే డబ్బులు పోవడంతో పాటు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ‘50% OFF’, ‘పర్సనల్ కంపానియన్’, ‘కాఫీ డేట్’ అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లు పెడుతున్నారు. 

గంటల వారీగా, డే ప్యాకేజీల పేరుతో రకరకాల ధరలను ప్రకటిస్తూ యువతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుకింగ్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు. అందమైన యువకుల ఫొటోలతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి చాటింగ్ మొదలుపెడుతున్నారు. తొలుత తియ్యటి మాటలతో నమ్మకం కలిగించి.. ఆ తర్వాత బుకింగ్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు. క్యూఆర్ కోడ్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా డబ్బులు చెల్లించిన వెంటనే అకౌంట్లను బ్లాక్ చేసి మాయమయ్యే అవకాశముంది.

ఇక్కడితో మోసం ఆగదు. చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలను ఉపయోగించి తర్వాత బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. కొందరు కేటుగాళ్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం కూడా ఉండటంతో యువతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నేరుగా కలిసేందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమే. డిస్కౌంట్ ఆఫర్లను చూసి తొందరపడి స్పందించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని, ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. యువతుల భద్రత విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చూస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనలు కనిపించినా, సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930కు ఫోన్ చేయాలి. అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి.

Rent Boyfriend Offers, Cybercrime, Instagram, Telegram, Facebook, Personal Companion, 
Coffee date, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

google-ad-img
    Related Sigment News
    • Loading...