Latest News
త్వరలో లక్ష్మీపురం, రుద్రారం పురాతన శివాలయం పునరుద్ధరణ
posted on: Mar 14, 2026 11:19AM

నల్గొండ జిల్లా, మిర్యాలగూడకి 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపురం, రుద్రారం గ్రామాల శివారు చెరువు సమీపంలోని కాకతీయుల కాలపు 13వ శతాబ్దినాటి శిధిల త్రికూటాలయ పునరుద్ధరణ పనుల సమావేశంఇటీవల ఆలయ ప్రాంగణంలో జరిగింది.
ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన శిధిల శివాలయాన్ని సందర్శించి, స్థానిక శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో ఆలయ చరిత్రను వివరించారు. కాకతీయ గణపతి దేవుని కాలంలో నిర్మించిన త్రికూటాలయంలో రెండు ఆలయాలు శిధిలం కాగా, ప్రధానాలయం మిగిలి ఉంది. మిగతా రెండు ఆలయాలు, రంగమండపం పునాదులు వరకు మాత్రమే ఉన్నాయి. , ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి శివలింగం, రెండు వీరభద్ర విగ్రహాలు, ఒక సూర్యుని విగ్రహం ఇంకా ఒక వీరుని శిల్పం ఉన్నాయని చెప్పారు.
గ్రామ పెద్దలు, లక్ష్మీపురం సర్పంచ్ ఆవుల మల్లారెడ్డి, ఎ. చంద్రారెడ్డి, నామిరెడ్డి రామిరెడ్డి చంద్రారెడ్డి, కాకునూరు శ్రీనివాస్, ఆవుల బక్కారెడ్డి, దేవేందర్ రెడ్డి, మట్టపల్లి శేఖర్, శ్రీను, పార్వతమ్మ, సైదమ్మ, చిట్యాల రమేష్, పాతపాటి వెంకటయ్య, మునగాల వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో, శిథిల శివాలయం పదిలపరిచి, ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన ప్లాన్లు, అంచనాలు తయారు చేయించమని శివనాగిరెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పి దూడల నిఖిల్ ఇంకా గ్రామస్తులు పాల్గొన్నారు.







