అమెరికాలో రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ.. ఇండియా దౌత్య,వ్యాపార విజయం!
posted on: Mar 16, 2026 9:58AM

అమెరికాలో గత యాభై ఏళ్లుగా ఎలాంటి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఎందుకు నిర్మించలేదు? ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు.. ఎందుకని? ఇందుకుగల కారణాలేంటి? అసలు అమెరికా ఆయిల్ నుంచి ఇతర మినరల్స్ వరకూ బయట దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కారణాలు ఏమై ఉంటాయ్? అంటే..
అమెరియా గత అర్ధ శతాబ్దంగా గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించలేదు. ఇందుకు గల కారణాలేంటని పరిశీలిస్తే.. ఇక్కడ కఠినతరమైన పర్యావరణ నిబంధనలుంటాయి. వీటినే ఈపీఏ రూల్స్ అంటారు. దానికి తోడు క్లీన్ ఎనర్జీ అయిన ఈవీ, సోలార్ వైపు మొగ్గు చూపడం వల్ల కూడా ఇక్కడి కంపెనీల కొత్త రిఫైనరీల నిర్మాణానికి వెనకాడుతుంటాయి. ప్రస్తుతం ఒక పక్క రష్యా- ఉక్రెయిన్ వార్ జరుగుతుండగా.. మరో పక్క ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లో అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ యుద్ధాల కారణంగా అమెరికా పదే పదే ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
కాగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీని జామ్ నగర్ లో నిర్వహిస్తోంది. తాజాగా ఇప్పుడు అమెరికాలో మరో రిఫైనరీని స్థాపిస్తోంది. అమెరికాలో రిలయెన్స్ అంబానీ రిఫైనరీ వెనక పలు కారణాలున్నాయి. ఈ రిఫైనరీని టెక్సాస్ లేదా లూసియానాలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రిలయన్స్ అమెరికాలోని టెక్సాస్ తీరంలో ఒక అత్యాధునిక చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించడమో లేదా, మూత పడిన కర్మాగారాన్ని రీమోడలింగ్ చేయడానికో సిద్ధపడుతోంది. అమెరికాలో షెల్ ఆయిల్ పుష్కలంగా ఉంది. అక్కడ రిఫైన్ చేసి నేరుగా యూరప్ లేదా అమెరికా మార్కెట్లలో అమ్మడం వల్ల రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. దీంతో భారీ లాభాలు కూడా వస్తాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయిల్ డిపెండెంట్ గా ఎన్నాళ్ళుంటాం, అమెరికాలో కూడా చమురు నిక్షేపాలను వెలికి తీయండంటూ పిలుపునిచ్చారు. దానికి తోడు మోడీతో ఉన్న ఫ్రెండ్ షిప్ తోడు కావడంతో అమెరికా ఇంధన భద్రత కోసం రిలయన్స్ వంటి సమర్ధవంతమైన సంస్థను ఆహ్వానించారు డోనాల్డ్ ట్రంప్.
ప్రస్తుతం రిలయన్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రిఫైనరీ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం పెట్రోలు మాత్రమే కాకుండా.. పెట్రో కెమికల్స్, క్లీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. అందుకు అనుగుణంగా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఒక ఇండియన్ కంపెనీ అమెరికా గడ్డపై చమురును నియంత్రించడం వల్ల.. అంతర్జాతీయంగా ధరలు పెరిగినపుడు ఇదెంతో మేలు చేస్తుంది. భారత్ కి ఎనర్జీ సెక్యూరిటీ సైతం లభిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. అలాగే అమెరికా కంపెనీలు భయపడుతున్న చోట రిలయన్స్ రిస్క్ చేయడం కూడా ఒక రకంగా ఇండియా దౌత్య వ్యాపార విజయగా అభివర్ణిస్తున్నారు. అమెరికా టెక్నాలజీ, ఇండియన్ మేనేజ్ మెంట్ అన్నది చాలా చాలా గ్రేట్ క్రేజీ కాంబో అంటున్నారు. ఈ రెండూ ఆయిల్ ఇండస్ట్రీలో కలవడం వల్ల.. మార్కెట్ ని మరింత శాసించవచ్చని విశ్లేషిస్తున్నారు.
అమెరికా గత యాభై ఏళ్లలో చేయలేని పనిని.. ఒక ఇండియన్ కంపెనీ చేసి చూపించడానికి ముందుకు రావడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఇది ఆర్ధికంగా భారత్ ఎంత బలపడుతోందో కూడా చాటుతోంది. ఒక వేళ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తితే.. రిలయన్స్ యూఎస్ లో స్థాపించబోయే ఈ రిఫైనరీ వల్ల ఆ దేశం సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.



.webp)


