అంబానీ అందుకు రాలేదా?

posted on: Jul 8, 2014 10:26AM

 

రిలయన్స్ అధిపతి అనిల్ అంబానీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయినపుడు, ఆయన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపన కోసం మాట్లాడేందుకే వచ్చారని అందరూ భావించారు. కానీ, ఆయన తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట వద్ద ఏర్పాటు చేసిన 7000మెగా వాట్స్ సామర్ధ్యం గల గ్యాస్ ఆధారిత రిలయన్స్ పవర్ ప్లాంటుకు కృష్ణ-గోదావరి బేసిన్ నుండి సరిపోయినంత గ్యాస్ అందజేయవలసిందిగా కోరేందుకే వచ్చారని స్పష్టమయింది.

 

సామర్లకోటలో ఏర్పటు చేసిన రిలయన్స్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ గత అనేక సంవత్సరాలుగా ఆశించిన మేర గ్యాస్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతోంది. తమ ప్లాంటుకు అధనంగా గ్యాస్ కేటాయించవలసిందిగా రిలయన్స్ సంస్థ యూపీఏ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నిరాకరించడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పతి జరగడంలేదు. చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ మరియు కేంద్రమంత్రులతో సత్సంబంధాలున్నందున, చంద్రబాబు ద్వారా తమ సంస్థకు అదనపు గ్యాస్ సంపాదించుకొనే ప్రయత్నంలోనే ఆయనను అంబానీ వచ్చి కలిసారు.

 

అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తూ, తాను కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఇటువంటి గ్యాస్ ఆధారిత ప్లాంట్లు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులను నివారించేందుకు కేజీ బేసిన్ లో ఫ్లోటింగ్ గ్యాస్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అనిల్ అంబానీ మాత్రం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలేవీ స్థాపిస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ ఆ తరువాత ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు మాత్రం అక్కడ కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.

 

అన్నివిధాల క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావాలంటే తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా పొందవలసి ఉంటుంది. ప్రత్యేకహోదా కోసం గట్టి ప్రయత్నాలు చేయకుండా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనుకోవడం అత్యాసే అవుతుంది. అందువల్ల రాష్ట్ర యంపీలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి కట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గట్టిగా ప్రయత్నించాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...