రీల్ హీరో టు రియల్ లీడర్

posted on: May 12, 2026 3:04PM

తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 ఒక నవశకానికి నాందిగా, అద్భుత మలుపుగా నిలిచిపోవడం ఖాయం. దశాబ్దాలుగా  రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ..  ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.  వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న  ఇళయ దళపతి.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ యుద్ధంలోనూ తన సత్తా చాటి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాలు కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాకుండా, తమిళ ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా నిలుస్తున్నాయి.   తమిళనాట సినిమాకు, రాజకీయాలకు మధ్య ఉన్న విడదీయరాని బంధం ఇప్పటిది కాదు.   1940వ దశకం నుంచే ద్రవిడ ఉద్యమ నేతలు తమ సిద్ధాంతాలను సామాన్యుల్లోకి బలంగా తీసుకెళ్లడానికి సినిమాలను ఒక శక్తిమంతమైన ఆయుధంగా వాడుకున్నారు.  సి.ఎన్. అన్నాదురై, ఎం. కరుణానిధి వంటి మేధావులు రాసిన పదునైన సంభాషణలు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి.  అప్పట్లో తక్కువ అక్షరాస్యత ఉన్న సమయంలో..  సినిమా తెరపై కనిపించే  రక్షకుడు (Saviour) అనే ఇమేజ్ ప్రజల మనసుల్లో బలంగా ముద్రపడిపోయింది. ఈ సంస్కృతి వల్లే పరిపాలనా అనుభవం కంటే..  వెండితెరపై కనిపించే గ్లామర్‌కే ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.   గతంలో ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) ఈ  రక్షకుడి మూసను రాజకీయాల్లో విజయవంతంగా అమలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పేదల పక్షపాతిగా వెండితెరపై మెరిసిన ఆయన.. 1977లో నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆయన తర్వాత జయలలిత సైతం అమ్మ  అనే భావోద్వేగపూరితమైన బ్రాండింగ్‌తో ఆరుసార్లు రాష్ట్రాన్ని పాలించారు. నేడు  విజయ్ కూడా అదే బాటలో పక్కా ప్రణాళికతో ముందడుగు వేశారు. 

తన కెరీర్ ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, సామాజిక అంశాల చుట్టూ తిరిగే సినిమాల ద్వారా ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన సఫలమయ్యారు.   విజయ్ రాజకీయ ప్రవేశం ఆకస్మికంగా జరిగింది కాదు.  దీని వెనుక దశాబ్ద కాలపు వ్యూహం ఉంది. మెర్సల్,  సర్కార్ వంటి చిత్రాల ద్వారా జీఎస్టీ, రైతుల సమస్యలు, రాజకీయ అవినీతిపై గళం విప్పి ప్రజల్లో తనపై ఒక సానుకూల దృక్పథాన్ని కల్పించారు. పార్టీ ప్రకటించక ముందే మక్కల్ ఇయ్యక్కం పేరుతో సుమారు 85 వేల ఫ్యాన్ క్లబ్‌లను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి..  క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేసుకున్నారు. 2026 ఎన్నికల ప్రచారంలోనూ హోలోగ్రామ్ ప్రసంగాలు, రోబోటిక్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి యువతను విశేషంగా ఆకట్టుకున్నారు.   

ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేశాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని, 35 శాతం ఓటు షేర్‌  సాధించింది.  ప్రధాన పార్టీలైన డీఎంకే 59 స్థానాలకు, ఏఐఏడీఎంకే 47 స్థానాలకు పరిమితమయ్యాయి. విజయ్ తన ప్రచారంలో  ద్రవిడ  గుర్తింపు కంటే  తమిళ' అస్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాదాపు ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఈ విజయంతో ఒక్కసారిగా పటాపంచలైంది.   అయితే..  ఈ విజయంపై మేధావి వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతని విధానాలు, బడ్జెట్ నిర్వహణ, పరిపాలనా సామర్థ్యం వంటివి ప్రామాణికంగా ఉండాలి. కానీ..  కేవలం సినిమాలు,  కటౌట్లు, గ్లామర్‌ను చూసి ఓటు వేయడం  సినిమాటిక్ హైజాక్' అని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పాలనాపరమైన అనుభవం లేని వ్యక్తులు అత్యున్నత పదవుల్లోకి రావడం వల్ల భవిష్యత్తులో పరిపాలనా నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందనిఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    ఒక్క మాటలో చెప్పాలంటే..  విజయ్ ఒక నటుడిగా వెండితెరపై గర్జించి ఉండవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా సంక్లిష్టమైన బ్యూరోక్రసీని, బడ్జెట్ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. భావోద్వేగపూరితమైన అభిమానం కంటే, హేతుబద్ధమైన విశ్లేషణే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. వెండితెరపై  మెస్సయ్యగా కనిపించిన విజయ్..  అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎంతవరకు పోరాడతారో, తన వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాలి. కాలమే ఆయన సమర్థతను నిర్ణయిస్తుంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...