ఎర్ర చందనం స్మగిలింగ్ సమస్య ఏపీ ప్రభుత్వానిదేనా?
posted on Sep 2, 2015 8:37AM
(1).jpg)
మూడు నెలల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ తరువాత స్మగిలింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయని అనుకొంటే ఇంకా పెరిగిపోయాయి. ఈ మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర అటవీశాఖ అధికారులు, పోలీసులు అనేకమంది ఎర్రచందనం చెట్లు నరుకుతున్న కూలీలను అరెస్ట్ చేసారు. అనేక కోట్ల విలువయిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నారు. అనేక వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. అయినా ఎర్రచందనం స్మగిలింగ్ కార్యకలాపాలు ఆగడం లేదు. స్మగ్లర్ల బారి నుండి ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
శేషాచలం అడవుల్లో ఈతమాకులగుంట అనే ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారనే సమాచారం అందడంతో 12మంది రిజర్వు పోలీసులు నిన్న రాత్రి అక్కడికి చేరుకొన్నప్పుడు అక్కడ వారికి ఏకంగా 200 మందికి పైగా స్మగ్లర్లు కనబడ్డారు. పోలీసుల కంటే స్మగ్లర్ల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో వారు పోలీసులపై రాళ్ళతో దాడి చేసారు. పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుండి పారిపోయారు. నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు.
ఇదివరకు ఎన్కౌంటర్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరణించినప్పుడు తమిళనాడులో అధికార అన్నా డీ.యం.కె.తో సహా అన్ని రాజకీయ పార్టీలనీ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేసాయి. చనిపోయిన వారందరూ ఎర్రచందనం స్మగ్లర్లు కారని, వారు పొట్ట కూటి కోసం పనిచేసే రోజువారి కూలీలేలని రాజకీయ పార్టీలన్నీ వాదించాయి. తమిళనాడు ప్రభుత్వం ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీల కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు, నష్టపరిహారం కూడా చెల్లించింది. ఏపీలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఎన్కౌంటర్ ని ఖండించాయి. కోర్టులు, మానవ హక్కుల సంఘాలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. నేటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎర్రచందనం స్మగిలింగ్ కార్యక్రమాలు మాత్రం నేటికీ యదేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి.
ఒక ప్రభుత్వం దీనిని నేరంగా భావిస్తున్నప్పుడు మరొక ప్రభుత్వం కూలీలకు ఉద్యోగాలు, నష్టపరిహారం ఇచ్చి ప్రోత్సహిస్తునంత కాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగానే అందరూ చూస్తున్నారు తప్ప దేశ సంపదను కొల్లగొడుతున్నట్లుగా, చట్ట వ్యతిరేఖ చర్యలుగా భావిస్తున్నట్లు లేదని రాజకీయ పార్టీల, తమిళనాడు ప్రభుత్వ ప్రతిస్పందన చూస్తే అర్ధమవుతోంది. ఎర్రచందనం స్మగిలింగ్ వార్తలను సర్వసాధారణ వార్తలయిపోయాయి. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
తమిళనాడుకు చెందిన కూలీలే ఈ స్మగిలింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిసినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో దీని గురించి మాట్లాడి ఈ సమస్యని శాశ్విత పరిష్కారానికి కృషి చేసి ఉంటే బాగుండేది. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం అందుకు సహకరించదనుకొంటే, ఈ ఎర్ర చందనం స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకే ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను, బలమయిన చట్టాలను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చును. ఇటువంటి స్మగిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవలసి ఉంటుంది. అలాకాక స్మగ్లర్లు చెట్లు నరుకుతున్నారని తెలిసినప్పుడు ఓ పదిమంది పోలీసులను పంపడం వలన స్మగ్లర్ల దాడిలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడమో లేకపోతే పోలీసుల కాల్పుల్లో స్మగ్లర్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం రాజకీయ పార్టీల నుండి నిరసనలు, కోర్టు కేసులు ఎదుర్కోవడం, పొరుగు రాష్ట్రంతో సంబంధాలు దెబ్బ తినడం తప్పకపోవచ్చును.