టార్గెట్ టీఆర్‌ఎస్.... వయా రెడ్ చిల్లీ... బీజేపీ కొత్త ప్లాన్
posted on May 4, 2017 5:20PM

తెలంగాణలో మిర్చి మంటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్‌కి దారి తీస్తోంది. అటు కేంద్ర మంత్రులు... ఇటు తెలంగాణ మంత్రుల ప్రకటనలతో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. మిర్చి రైతుల కష్టాలకు కారణం ...మీరంటే మీరంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు వాదులాడుకుంటున్నారు. తప్పు మీదంటే మీదంటూ మాటల తూటాలు విసురుకుంటున్నారు. మిర్చి రైతులను కేంద్రమే ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్నదాతలు కష్టాల పాలయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వాణిజ్య పంటలపై దృష్టిపెట్టాలని సూచించడంతో... రైతులు.. మిర్చిని పెద్దఎత్తున సాగు చేశారని, అయితే ఉత్పత్తికి తగ్గట్టుగా మిర్చిని కొనుగోలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర కోసం నెలరోజులుగా మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.... పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలోనూ జాప్యం చేసిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు.
మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా..... మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద నివేదిక పంపడంలో తెలంగాణ సర్కార్ ఆలస్యం చేసిందని, అందుకే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో జాప్యం జరిగిందని కమలం నేతలు అంటున్నారు. తప్పంతా రాష్ట్ర ప్రభుత్వం చేసి.... కేంద్రంపై నిందలు వేయడం సరికాదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే మిర్చి రైతులు నష్టపోయారని, ఇకనైనా సమస్యలను సకాలంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తే ఆదుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు.
మొత్తానికి మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావడంతో ఇప్పుడు క్రెడిట్ కోసం బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పోటీపడుతున్నారు. ఇది తమ ఘనతంటే తమ ఘనతంటూ వాదులాటకు దిగుతున్నారు.