ప్రశ్నించిన పాప, స్పందించిన డాబర్
posted on: Feb 17, 2017 4:02PM

గౌహతి లోని 9 ఏళ్ళ పాప అబ్బాయిలకు మాత్రమే అని అర్ధం వచ్చేలా ఉన్న ప్యాకింగ్ చూసి, ఒక జ్యూస్ తాగడానికి నిరాకరించింది. డాబర్ వారి రియల్ జ్యూస్ ప్యాక్ మీద ఒక అబ్బాయి స్కూల్ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తాడు. దానిపైన ఉన్న కాప్షన్ ఏంటంటే, ‘ఏదైతే మీ చిన్నారికి మంచిదో.. అది అతడి ముఖంలో చిరునవ్వు కూడా తేవాలి’.
అంతటితో ఆగకుండా, ఆ చిన్నారి తన తండ్రిని ఒక ప్రశ్న వేసింది. "నాన్న రియల్ పళ్ళ రసం కేవలం అబ్బాయిల కోసమేనా," అని. హతాశుడైన ఆ తండ్రి, యూనియన్ మినిస్టర్ మేనకా గాంధీ కి తన కూతురు ప్రశ్న వివరించేలా ఉత్తరం రాసాడు. స్పందించిన మేనకా గాంధీ సదరు డాబర్ కంపెనీ వాళ్ళకి వివరణ కోరుతూ ఉత్తరం రాసింది.
ఏకంగా, యూనియన్ మినిస్టర్ అడిగిన తర్వాత రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? జ్యూస్ ప్యాక్ కేవలం పురుషుల కోసం కాదని, జనరల్ సెన్స్‌లో ‘అతడు’అనే పదం వాడామని ప్రకటన విడుదల చేసింది. అందరికీ ఆపాదించేలా జ్యూస్ ప్యాకింగ్ మార్చడానికి అంగీకరించింది. రియల్ ఫ్రూట్ పవర్ ప్రొడక్ట్‌పై చిన్నారి పాప సహా నలుగురు కుటుంబసభ్యులున్న హ్యాపీ ఫ్యామిలీ చిత్రం వేస్తామని తెలిపింది. ఇది నిజంగా ఆ 9 ఏళ్ళ పాప ఘనవిజయం గా అభివర్ణించొచ్చు!






