సట్లజ్ సినిమా నిషేధం వెనుక అసలు వాస్తవాలు.!

posted on: Jul 8, 2026 4:40PM

పంజాబ్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన, బాధాకరమైన కాలానికి సంబంధించిన చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సట్లజ్ (పూర్వపు పేర్లు ఘల్లుఘరా, పంజాబ్ 95  చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైనప్పటికీ, అక్కడ కూడా నిషేధానికి గురికావడం గమనార్హం. భావప్రకటనా స్వేచ్ఛ, జాతీయ భద్రత, చారిత్రక నిజాల మధ్య నలిగిపోతున్న ఈ చిత్రం చుట్టూ ఉన్న వివాదాలు, పంజాబ్ ఉగ్రవాద నేపథ్యం..  ఈ సినిమాపై వస్తున్న భిన్నాభిప్రాయాలను విశ్లేషిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.

ఈ చిత్రం ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత విశేషాల ఆధారంగా రూపొందింది. 1980,  1990లలో  పంజాబ్‌లో ఉగ్రవాదం పతాకస్థాయికి చేరినప్పుడు, ఆ తర్వాత జరిగిన ప్రతి తిరుగుబాటు చర్యలలో భాగంగా పోలీసులు చట్టేతర హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పంజాబ్ పోలీసులు వేలాది మంది సిక్కు యువకులను అక్రమంగా నిర్బంధించి, ఎన్‌కౌంటర్ల పేరిట హతమార్చి, వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మృతదేహాలను  వారసత్వం లేనివిగా రహస్యంగా దహనం చేశారని ఖల్రా చేసిన పరిశోధనలను ఈ సినిమాలో చూపించారు. మున్సిపల్ రికార్డులు, శ్మశానవాటికల పత్రాలను సేకరించి, సుమారు 25 వేల మంది ఇలా అదృశ్యమయ్యారని ఆయన అంతర్జాతీయ వేదికలపై గళమెత్తడం, ఆ తర్వాత ఆయన అపహరణకు గురై కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రమైన రాజకీయ, సామాజిక అంశాలను ఈ చిత్రం స్పృశించింది.

అయితే..  భారత పరిపాలనా యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అత్యంత ప్రతికూల కోణంలో చూపించడం వల్ల సమాజంలో అశాంతి రేకెత్తే అవకాశం ఉందంటూ సెంట్రల్ బాడీ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ఈ సినిమాకు  బ్రేకులు వేసింది. సినిమా అసలు పేరు  ఘల్లుఘరా అంటే మారణకాండ..   ఈ పేరు నుండే వివాదం మొదలైంది. బోర్డు మొదట 21 కోతలను విధించగా, ఆ తర్వాత కీలక సన్నివేశాలు, సంభాషణలు, చివరకు ప్రధాన పాత్రల పేర్లు మార్చాలని ఏకంగా 127 కోతలను ప్రతిపాదించింది. ఇన్ని మార్పులు చేస్తే సినిమా ఆత్మ దెబ్బతింటుందని భావించిన చిత్రబృందం థియేట్రికల్ విడుదలను పక్కనబెట్టింది. 2026 జూలై 3న  సట్లజ్ పేరుతో అన్‌కట్ వెర్షన్‌ను నేరుగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసింది. అలా విడుదలైన సట్లజ్  కేవలం 48 గంటల వ్యవధిలోనే  ప్రస్తుత పరిణామాలు  అనే కారణాన్ని చూపుతూ ఇండియాలో ఈ సినిమాను పూర్తిగా నిలిపివేయడం సంచలనంగా మారింది.

సినిమా వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పంజాబ్ చరిత్రలోని 1978-1995 నాటి పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. 1973లో అకాలీ దళ్ ఆమోదించిన ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానం ద్వారా పంజాబ్‌కు స్వయంప్రతిపత్తి, నదీ జలాల పంపిణీ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం దీనిని దేశ విభజన వాదంగా పరిగణించడంతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత అమృత్‌సర్‌లో జరిగిన మతపరమైన ఘర్షణలు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఎదుగుదలకు కారణమయ్యాయి. స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలతో ప్రవేశించిన తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన  ఆపరేషన్ బ్లూ స్టార్, ఆ తదనంతర పరిణామాలలో ఇందిరా గాంధీ హత్య, దేశవ్యాప్తంగా జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు పంజాబ్‌ను మరింత హింసలోకి నెట్టాయి. ఆ తర్వాత 1990లలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ గిల్ ఆధ్వర్యంలో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పోలీసులకు విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి.

ఈ నేపథ్యంలోనే మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు వెల్లువెత్తాయి. జస్వంత్ సింగ్ ఖల్రా అమృత్‌సర్, తార్న్ తారన్ వంటి జిల్లాలలో పరిశోధనలు చేసి, వేలాది అనామక మృతదేహాల దహన సంస్కారాల ఉదంతాలను బయటపెట్టారు. 2005లో కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన సీబీఐ దర్యాప్తులో ఖల్రా అపహరణ, హత్య కేసులో ఆరుగురు పోలీసు అధికారులకు యావజ్జీవ శిక్ష పడిన మాట వాస్తవమే అయినప్పటికీ, సినిమా చూపించిన పాతికవేల మరణాల సంఖ్యను ఏ అధికారిక పత్రాలు ధృవీకరించలేదని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. కేవలం కొన్ని జిల్లాల సమాచారాన్ని రాష్ట్రం మొత్తానికి వర్తింపజేసి భారీ సంఖ్యలను చూపించడం పట్ల సామాజిక మాధ్యమాలలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ చిత్రంలో అవలంబించిన సృజనాత్మక పద్ధతులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేసిన  సూపర్ కాప్ గా పేరొందిన కేపీఎస్ గిల్‌ను కేవలం ఒక ప్రతినాయకుడిగా, దురాగతాల రూపకర్తగా ఏకపక్షంగా చూపించారని, ఆ కాలంలో ఖనుస్తాన్ తీవ్రవాదులు సృష్టించిన బీభత్సాన్ని సినిమా పూర్తిగా విస్మరించిందని పలువురు వాదిస్తున్నారు. హిందువులను, మితవాద సిక్కులను లక్ష్యంగా చేసుకుని బస్సులు, రైళ్లలో జరిగిన హత్యాకాండలను, పంజాబ్ విడిచి వెళ్లిన వేలాది హిందూ కుటుంబాల గాధలను సినిమాలో ఎక్కడా ప్రస్తావించకపోవడం కథనంలోని లోపాన్ని తెలియజేస్తోంది. అలాగే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన 1,700 మందికి పైగా సిక్కు పోలీసు అధికారుల త్యాగాలను పక్కనబెట్టి, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని క్రూరమైన శక్తిగా మలచడం గమనార్హం. చివరకు ఒక ముఖ్యమంత్రి హత్య సన్నివేశాన్ని కూడా ఉల్లాసభరితమైన సంగీతంతో కీర్తించినట్లు చూపించడం నైతికంగా తప్పుదారి పట్టించడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో అధికారికంగా ఈ సినిమా ప్రసారాలు నిలిచిపోయినప్పటికీ, అంతర్జాతీయంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండటం, సామాజిక మాధ్యమాలలో అనధికారిక లింకుల ద్వారా ఈ చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూనే ఉంది. ఒక చారిత్రక విషాదాన్ని, మానవ హక్కుల పోరాటాన్ని తెరపైకి తెచ్చేటప్పుడు నైతిక బాధ్యత, సమతుల్యత ఎంతో అవసరమని ఈ వివాదం స్పష్టం చేస్తోంది. శాంతిభద్రతలు, సామాజిక స్థిరత్వాన్ని కాపాడటం ఒకవైపు, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించడం మరోవైపు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఈ చిత్రంపై విధిస్తున్న ఆంక్షలు ఎంతవరకు సమర్థనీయమనేది ప్రేక్షకుల వ్యక్తిగత విశ్లేషణకే వదిలివేయవలసి ఉంటుంది.

వలసలు,  ఆర్థిక ప్రయోజనాల కోణం

ఈ వివాదంలో విమర్శకులు లేవనెత్తుతున్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే..  ఆ కాలంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్న చాలా మంది యువకులు అక్రమ మార్గాల ద్వారా కెనడా, బ్రిటన్, యూరప్ దేశాలకు పారిపోయి అక్కడ రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలు ప్రభుత్వ నష్టపరిహారాలు, అంతర్జాతీయ సంస్థల నుండి వచ్చే ఆర్థిక సహాయం కోసం వారు  అదృశ్యమయ్యారని లేదా పోలీసుల చేతిలో చనిపోయారని తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. ఈ వాస్తవాన్ని సినిమా పూర్తిగా దాచిపెట్టడం వల్లే ఇది కేవలం ఒక ప్రచార చిత్రంగా  మిగిలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.      

diljit dosanjh punjab 95, jaswant singh khalra story, kps gill punjab police, punjab insurgency

google-ad-img
    Related Sigment News
    • Loading...