సీఎం జగనే...కానీ పాలన మాత్రం ఆయనదా ?

 

ఏపీలో ఆగ‌స్ట్ 15వ తేది నుంచి గ్రామ సేవ‌కుల వ్య‌వ‌స్థ అమ‌లులోకి రానుంది. దీంతో ఇక‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ వారి చేతుల మీదుగానే పంపిణీ కానున్నాయి. ఆఖ‌రికి రేష‌న్ స‌రుకుల‌ను సైతం గ్రామ సేవ‌కులే ఇంటింటికి చేరుస్తారని సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటి దాకా రేష‌న్ అందిస్తున్న డీల‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు కానుంది. వేలాది మంది రేష‌న్ డీల‌ర్లు రోడ్డున ప‌డ‌నున్నారు, అయితే ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే వారంతా త‌మ రేష‌న్ డీల‌ర్ల వ్య‌వ‌స్థ‌ను రద్దు చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ ప‌లు విన్న‌పాలు చేశారు. 

అయినా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేని నేప‌థ్యంలో ఎపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఆధ్యాత్మిక గురువు స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్ప‌తిని ఈ రేష‌న్ డీల‌ర్లు ఆశ్రయించారు. ఈ వ్య‌వ‌స్థ ర‌ద్దు కాకుండా త‌మ‌రే త‌మ‌ను ర‌క్షించాల‌ని ఈరోజు స్వామిజీ అభ్య‌ర్ధించారు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిజానికి స్వాములు ఆధ్యాత్మిక దీవెనలు ఇస్తారు తప్ప ప్రభుత్వాలు, మంత్రులు, సీఎంల మాదిరిగా సమస్యలు పరిష్కరించరు కదా. మరి అలాగైతే.. రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం స్వరూపానంద వద్దకు ఎందుకు వచ్చినట్టు ? అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.

ఏపీలో ఏ పని కావాలన్నా స్వరూపానంద ఆశీస్సులు ఉంటే చాలని, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ నిత్యం స్వామి వారి పాద సేవ చేస్తుంటే స్వామి వారి నోట నుంచి వచ్చే మాటను పెడచెవిన పెట్టరని, ఈ లాజిక్ గ్రహించిన రేషన్ డీలర్లు ఇలా తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ను ఆశ్రయించడానికి బదులుగా నేరుగా స్వరూపాందన వద్దకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. 

గతంలో తెలంగాణలోనూ చిన్నజీయర్ స్వామిని కలిసి రెవెన్యూ ఉద్యోగులు ఆ శాఖను ప్రక్షాళన చేయకుండా కేసీఆర్ కు చెప్పాలని వినతిపత్రం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు జగన్ విషయంలో కూడా రేషన్ డీలర్ లు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే ఇదంతా కావాలని చేసిందని వైసీపీ అనుకూల వెబ్ మీడియా కధనాలు ప్రచురించింది. స్వామీజీని కలసిన రేషన్ డీలర్ల వర్గం అసలు యూనియన్ లో ఒక భాగం మాత్రమేనని కేవలం జగన్ ని టార్గెట్ చేయడం కోసమే వారు ఈ పనిచేసినట్టు తెలుస్తోందని కధనాలు ప్రచురించింది. 

గతంలో జగన్ స్వామీజీని కలిసినప్పుడు టీడీపీ నేతలు నానా హంగామా చేసి స్వరూపానంద పవర్ సెంటర్ గా మారుతున్నారని ఆరోపించారని ఆ ఆరోపణలకి తగ్గట్టే మంత్రివర్గ కూర్పు సమయంలో చాలామంది ఆశావహులు స్వరూపానంద దర్శనానికి ఎగబడ్డారు కూడా. ఆ తర్వాత జగన్ నుంచి సూచనలు వెళ్లాయో లేక స్వామీజీయే అవగతం చేసుకున్నారో తెలియదు కానీ ఇటీవల రాజకీయ తాకిడి శారదా పీఠానికి కాస్త తగ్గిందని, కానీ ఇప్పుడు కావాలనే ఇలా రేషన్ డీలర్ లు చేశారని అంటున్నారు. 

ముందుగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నామని చెబితే శారదా పీఠం నిర్వాహకులు ఒప్పుకోలేదని, అందుకే భక్తుల ముసుగులో ఆ డీలర్లు స్వామీజీని కలిశారని, ఎక్కడా డీలర్లనే ప్రస్తావనే రాకుండా, అసలు సమస్య ఏమిటో కూడా స్వరూపానందకు చెప్పకుండా దర్శనం చేసుకుని, ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు తీసుకుని వైరల్ చేశారనేది ఆ మీడియా సారాంశం. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఆ స్వరూపానంద స్వాముల వారికే ఎరుక.