బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం
posted on Nov 3, 2025 9:08AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదనికి రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు ఆగిపోయాని స్ధానికులు తెలిపారు.