రామోజీని కేసీఆర్ ఎందుకు పొగిడారంటే...

 

అనవసరంగా ఎవర్నీ పొగడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నీమధ్య మీడియా మొఘల్, ఫిలింసిటీ రూపకర్త, ముఖ్యంగా ‘ఆంధ్రోడు’ అయిన రామోజీరావును భారీ స్థాయిలో పొగిడారు. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా రామోజీ ఫిలింసిటీలో ఐదు గంటలపాటు గడిపి ఫిలింసిటీని, త్వరలో నిర్మించబోయే ‘ఓం’ నగరాన్ని, రామోజీని పొగడ్తల వర్షంలో ముంచేశారు. కేసీఆర్ నోటి వెంట ఆంధ్రులను తిట్టడమే విన్నవారికి ఇది ఒక పిడుగులాంటి పరిణామం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ‘‘లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని దున్నుతాం’’ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడిలా రామోజీని లక్ష పొగడ్తలతో ముంచేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బిత్తరపోయేలా చేసింది. జనానికి షాకులివ్వడం కేసీఆర్‌కి కొత్త కాదు. అయితే ఇంత పెద్ద షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఆ షాక్ నుంచి జనం తేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం వుంది. ఊరికే పొగడరు మహానుభావులన్నట్టుగా రామోజీని కేసీఆర్ ఈ రకంగా పొగడ్డం వెనుక వున్న అసలు కారణాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

దొరతనం పుష్కలంగా వున్న కేసీఆర్ మొదటి నుంచీ రామోజీరావుకు చెందిన సామాజికవర్గం అంటే విపరీతమైన మంట. రాష్ట్ర విభజనను ఆ సామాజికవర్గానికి చెందినవారే విపరీతంగా వ్యతిరేకించారన్న ఆగ్రహం ఆయనకి వుంది. అందుకే తన మాటల్లో, చేతల్లో ఆ కులం మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ వుండేవారు. ఆ కులానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న అక్కసు కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తూ వుండేది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు రామోజీరావు ఆహ్వానించకుండానే ఫిలిం సిటీకి వెళ్ళడానికి, పొగ్గడ్డానికి వెనుక వున్నది రాజకీయ కారణాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

ఉద్యమం చేస్తున్న సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన వారిని కేసీఆర్ ఎంత ఘాటుగా విమర్శించినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు బలమైన ఆ సామాజికవర్గాన్ని తిట్టి ఉపయోగం లేదని కొంతమంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేసీఆర్‌కి ఉపదేశం చేసినట్టు సమాచారం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఇప్పటికే చెందిన అభివృద్ధి ఆగిపోకుండా వుండాలంటే ఆ సామాజికవర్గంతో అనుబంధాన్ని పెంచుకోక తప్పదని వారు సూచించినట్టు తెలుస్తోంది.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రామోజీరావు మీద, ఫిలింసిటీ మీద, మార్గదర్శి మీద కక్షగట్టి వ్యవహరించారు. అది అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని రామోజీ కులస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రామోజీ మీద చేస్తున్న దాడి తమ సామాజికవర్గం మీద చేస్తున్న దాడిగానే అందరూ భావించారు. దాంతో వారంతా క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. ఇప్పుడు వైఎస్సార్ చేసిన తప్పే మీరూ చేయడం ఎందుకని కేసీఆర్ సన్నిహితులు చెవిలో ఇల్లు కట్టుకుని బోధించినట్టు భోగట్టా.

 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టినవారిలో, భారీ సంఖ్యలో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారిలో ఆ కులానికి చెందిన వారే ఎక్కువమంది వున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వాళ్ళంతా మూటాముల్లె సర్దుకుని ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళిపోతే తెలంగాణకు తీరని నష్టం జరిగే ప్రమాదం వుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలు ప్రారంభమైన తెలంగాణకు అది మరొక పెద్ద కష్టం అయ్యే అవకాశం వుంది. అందుకే ఆ కులాన్ని మంచి చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. అందులో భాగమే రామోజీని పొగడ్డం, అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వబోవడం అని విశ్లేషకులు అంటున్నారు.

 

ఇవాళో రేపో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖతోపాటు విద్యుత్ శాఖను కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇది కూడా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రంలో విద్యుదుత్పాదన కంపెనీలు నిర్వహిస్తున్నవారు, బిల్డర్లు ఎక్కువమంది తుమ్మల సామాజికవర్గానికి చెందినవారే. ఆ రెండు రంగాలకూ తుమ్మలను మంత్రిగా చేయడం వల్ల తన సామాజికవర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా తుమ్మల చేయగలరన్న నమ్మకంతోనే కేసీఆర్ ఆ రెండు శాఖలను తుమ్మలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల హోంశాఖ మంత్రి కావాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కేసీఆర్ ఆయనను ఈ రెండు శాఖలనే కేటాయించనున్నారని తెలుస్తోంది.

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గం టీఆర్ఎస్‌కి దూరమైపోయింది. కాంగ్రెస్ నాయకుడు జానా ఛార్మ్ కోల్పోవడంతో ఇప్పుడు అందరూ టీడీపీ నాయకుడు రేవంత్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అని వాళ్ళు నమ్ముతున్నారు. రేవంత్ సామాజికవర్గానికి రామోజీ సామాజివర్గం వాళ్ళు కూడా కలిశారంటే అది రాజకీయంగా టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం చేసే అవకాశం వుంది. దాంతో రేవంత్ కులం ఎలాగూ తనకు దూరమైపోయింది... ఇప్పుడు రామోజీ కులాన్నయినా దగ్గర చేసుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంచేత లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని కేసీఆర్ దున్నితే చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఇక ఆశలు వదులుకోవడం మంచింది.