భవిష్యత్ లో జ్ణానపీఠ్, పులిట్జర్ స్థాయికి రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు.. చంద్రబాబు

రామోజీరావును ఎక్స్ లెన్స్ కు ప్రతిరూపంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. రామోజీ జయంతి సందర్భంగా ఆదివారం (నవంబర్ 16) రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ప్రసంగిస్తూ.. రామోజీరావు స్ఫూర్తితో తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రామోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు.  రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షరయోధుడికి ఘన నివాళులర్పిస్తున్నానన్న చంద్రబాబు  రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.  

రామోజీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధం అన్న చంద్రబాబు  ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు.  ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదన్నారు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారనీ, నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయమనీ చంద్రబాబు చెప్పారు.  ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్ గా ప్రజల తరఫున పనిచేస్తానని రామోజీరావు చెబుతుండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  

ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే అందుకు రామోజీరావు సంకల్పమే కారణమన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రామోజీ ఎన్నడూ రాజీ పడలేదనీ, ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడారనీ చంద్రబాబు అన్నారు.  50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ఆయన ఇవాళే ఆలోచించే దార్శనికత రామోజీ సొంతమన్న చంద్రబాబు.. ఆయన దూరదృష్టికి  రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమన్నారు. 

జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకమన్న చంద్రబాబు . ఈ రామోజీ  ఎక్సలెన్స్ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకోవాలని  చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలం గాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu