Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."పరువు..ప్రతిష్టలే" దళితుల ప్రాణాలు తీస్తున్నాయా...?
posted on: Jul 14, 2016 5:46PM

"కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని కోడలిని చంపిన అత్తమామలు" .."కులం కోసం కొత్త జంటను కడతేర్చిన కులపెద్దలు"..ఇలా తరచూ వార్తలు వింటూ వుంటాం. ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా తనకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే స్వేచ్ఛ ఈ తరం యువతి, యువకులకు లేకుండా కుల గోడలు అడ్డుకుంటున్నాయి. ''కూటికి పేదలమైనా, కులానికి పేదలం కాదు'' నానుడి నుంచి స్పూర్తి పొంది హత్యలకు శ్రీకారం చుట్టారు. తమ కులాన్ని కాదంటే పరువు పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. పరువు హత్యలంటే కుల దురంహాకార హత్యలే. దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల్లో మెజారిటీ దాడులు కులాంతర వివాహాలు చేసుకోవడం వల్లే జరుగుతున్నాయట...ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తూ కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అత్వాలే.
కులాంతర వివాహాలకు సంబంధించి దళితులపై దాడులు ఆగాలంటే ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు అనుమతించాలని సూచించారు. మహారాష్ట్ర దళిత నేతగా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న రామ్‌దాస్, గతంలో చాలా సార్లు ఈ డిమాండ్ చేశారు. ఈ సారి కేంద్రమంత్రి కావడంతో ఆయుధాల విషయంపై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయుధాలు అనుమతించే అంశం గురించి నా శాఖ ఆలోచన చేస్తోంది. కాకపోతే, ఇది ప్రధానంగా హోంశాఖ పరిధిలోనిది అని దాస్ అన్నారు.
భారతదేశంలో కుల జాడ్యం ఇంతగా వేళ్లూనుకుపోవడానికి కారణం స్వకుల వివాహాలు. కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పురాణాలు, మతం అన్నీ స్వకుల వివాహాలను సమర్థిస్తున్నాయి. ఈ పద్థతిని అనుసరించడం దైవ సమ్మతం అని నమ్ముతారు. అంతేకాదు కుటుంబ గౌరవం, కుల గౌరవం పాటించాలని చెబుతారు. అగ్రకుల పురుషుడు, దళిత కుల అమ్మాయితో వివాహాన్ని ఆమోదించరు..అలాగే దళిత పురుషుడు, అగ్రకుల స్త్రీతో వివాహాన్ని కూడా సహించరు. అటువంటి పెళ్లిళ్లను అడ్డుకోవడానికి ఎటువంటి దుర్మార్గానికైనా వెనుకాడరు. చివరికి తప్పు చేసింది కన్న కూతురైనా..కొడుకైనా కులం తెరలు కమ్ముకున్న కళ్లకు కనిపించరు..పరువు పోయింది..రేపటి నుంచి నలుగురిలో తలెత్తుకు తిరగలేను అని క్షణికావేశంలో కత్తిదూస్తున్నారు. పరువు హత్యలకు గురయ్యేవారిలో దళితులే కాదు, మిగతా కులాల వారు ఉన్నారు. దురదృష్టవశాత్తూ దళితులు ఎక్కువ దాడులకు గురవుతున్నారు.






