Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'చిరుత'గా రామ్ చరణ్ పరిచయమై నేటికి 15 ఏళ్ళు
posted on: Sep 28, 2022 4:17PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమై నేటికి పదిహేను ఏళ్ళు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు చరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2007 న విడుదలైంది. నేటితో 'చిరుత' విడుదలై 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
చిరంజీవి తనయుడిగా పరిచయమైనప్పటికీ మొదటి సినిమాలోనే చరణ్ తన మార్క్ చూపించాడు. చరణ్ యాక్షన్ కి, డ్యాన్స్ లకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన డెబ్యూ హీరోగా చరణ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకున్నాడు.
పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్, డైలాగ్స్, కామెడీతో 'చిరుత' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని విజయాన్ని సాధించింది. ఇక ఇందులో నచ్చిమి పాత్రలో అలీ పండించిన నవ్వులు గురించి ఎంత చెప్పినా తక్కువే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఆయన స్వరపరిచిన అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా 'యమహో యమ', 'చమ్కా చమ్కా', 'మారో మారో' వంటి పాటలు ఒక ఊపు ఊపాయి.
'చిరుత'తో బలమైన పునాది వేసుకున్న చరణ్.. రెండు సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 'రచ్చ', 'నాయక్', 'ఎవడు', 'ధృవ' వంటి విజయాలతో సత్తా చాటాడు. 2018 లో వచ్చిన 'రంగస్థలం'తో సరికొత్త రికార్డులు సృష్టించిన చరణ్.. ఈ ఏడాది వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'చిరుత' సినిమాతో పరిచయమైన ఈ మెగా వారసుడు నిజంగానే చిరుతలా దూసుకుపోతూ ఈ 15 ఏళ్లలోనే ఎంతో సాధించాడు.






