ఇక రాజ్యసభకూ బీజేపీయే "రూలర్"..?
posted on Feb 28, 2018 3:10PM
.jpg)
నరేంద్రమోడీ ఛరిష్మాతో గత సార్వత్రిక ఎన్నికల్లో.. మేజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ.. ఎన్డీఏ మిత్రపక్షాల బలం దీనికి అదనం.. దీంతో లోక్‌సభలో కమలానికి ఎదురులేకుండా పోయింది. జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణ అంత సులభంగా ఆమోదం పొందింది అంటే అందుకు బీజేపీ బలమే కారణం. లోక్‌సభలో బిల్లులు ఆమోదించుకుంటున్నా.. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. అక్కడ ప్రతిపక్షాలకు తిరుగులేని బలం ఉండటంతో బీజేపీ ఆటలు సాగడం లేదు. 58 సభ్యుల బలంతో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టినప్పటికీ.. ప్రతిపక్షాలదే హవా.. అయితే ఇక మీదట పెద్దల సభలోనూ కమలం ఆధిపత్యాన్ని చలాయించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. ఇక ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో పొత్తుల కారణంగా మరికొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది. కేంద్రానికి అప్రకటిత మిత్రపక్షాలుగా వ్యవహరిస్తోన్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీల మద్దతును కలుపుకుంటే బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాజ్యసభలో ప్రతిపక్షాలకు తలొగ్గాల్సిన అవసరం ఇక బీజేపీకి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.