Latest News
ఓటమిని తలదించుకునేలా చేసిన స్ఫూర్తిదాయక విజయం.. రాజేశ్వరి
posted on: Mar 9, 2026 2:25PM

ఓటమి విజయానికి తొలి మెట్టు అని భావించి వైఫల్యాలకు కుంగిపోకుండా పట్టుదలతో ముందడుగు వేసి అనుకున్నది సాధించారు రాజేశ్వరి సువే. సివిల్స్ లో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సువేది ఒక స్ఫూర్తిదాయక గాధ. అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో ఆమె సాధించిన విజయం నాలుగు వైఫల్యాల తరువాత ఆమెకు చిక్కింది. కృషి ఉంటే మనుషులు రుషులౌైతారు.. మహాపురుషులౌతారు అన్నట్లుగా ఆమె వరుస వైఫల్యాలకు కుంగిపోకుండా.. పట్టుదలతో ముందడుగు వేసి సివిల్స్ ర్యాంకు సాధించారు.
మదురై జిల్లా వాడిపట్టికి చెందిన రాజేశ్వరిది విద్యావంతుల కుటుంబం. తండ్రి మురుగేశన్ వ్యాపారవేత్త కాగా, తల్లి ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్. చెన్నైలోని వెల్-టెక్ మల్టీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజేశ్వరి, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్‌గా ఉండేవారు. ఆ క్రమశిక్షణే ఆమెను సివిల్స్ వైపు నడిపించిందని చెబుతారామె.
రాజేశ్వరి ప్రస్తుతం తమిళనాడులో డిప్యూటీ కలెక్టర్‌గా (గ్రూప్-1) శిక్షణ పొందుతున్నారు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సమయాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. అసాధ్యం అనే పదం తన డిక్షనరీలోనే లేదని రాజేశ్వరి తన విజయంతో నిరూపించారు.
కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా, ప్రతి అంశంపై తనదైన శైలిలో షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ సివిల్స్ కు ప్రిపేరయ్యారామె. సమాజంపై లోతైన అవగాహన కోసం ఆమె సోషియాలజీ ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నారు. దినపత్రికలను క్షుణ్ణంగా చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించారు. ఇంటర్వ్యూ బోర్డు ముందు తెలియని ప్రశ్నలకు తెలియదు నిజాయితీగా బదులిచ్చారు. అలాగే, డిప్యూటీ కలెక్టర్‌గా తన అనుభవాలు కూడా ఇంటర్వ్యూను సమర్ధంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డాయని చెబుతారామె. సాధారణంగా టాప్ ర్యాంకర్లెవరైనా ఐఏఎస్ ను ఎంచుకుంటారు. కానీ రాజేశ్వరి మాత్రం తన లక్ష్యం ఐపీఎస్ ఐపీఎస్ అని దృఢంగా చెప్పారు.
ఎన్సీసీ క్యాడెట్ గా యూనిఫాం ధరించినప్పుడు కలిగిన గర్వం, దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం పనిచేయాలనే తపనే తనను ఐపీఎస్ వైపు నడిపించాయన్నారు రాజేశ్వరి.. ఓటమిని తలదిం చునేలా చేసిన రాజేశ్వరి ప్రస్థానం నేటి యువతకు, సివిల్స్ అభ్యర్థులకు నిస్సందేహంగా స్ఫూర్తిదాయకం.






