Latest News

రాజస్థాన్ రాయల్స్ జట్టు విక్రయం... రూ.15,000 కోట్లతో నయా రికార్డ్!

posted on: Mar 25, 2026 4:44PM

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత భారీ డీల్ ఒకటి చోటు చేసుకుంది. లీగ్ ప్రారంభం నుంచి కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం పూర్తిగా మారిపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రికార్డు స్థాయి ధర చెల్లించి సొంతం చేసుకుంది. దాదాపు 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,286 కోట్లు) ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఈ భారీ కొనుగోలు వెనుక ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం 'వాల్‌మార్ట్' వారసుడు రాబ్ వాల్టన్ అండదండలు ఉండటం గమనార్హం. గతంలో రాజస్థాన్ రాయల్స్‌లో మైనారిటీ వాటా కలిగి ఉన్న కల్ సోమాని, ఇప్పుడు ఏకంగా 100 శాతం వాటాను దక్కించుకున్నారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీకి లభించిన అత్యధిక విలువగా విశ్లేషకులు భావిస్తున్నారు.

కల్ సోమాని నేతృత్వంలోని ఈ బృందంలో రాబ్ వాల్టన్‌తో పాటు ఎన్ఎఫ్ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్ యజమానులైన హాంప్ కుటుంబం కూడా భాగస్వాములుగా ఉన్నారు. టెక్నాలజీ, విద్య మరియు కృత్రిమ మేధ  రంగాల్లో విశేష అనుభవం ఉన్న సోమాని, స్పోర్ట్స్ బిజినెస్‌లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు మనోజ్ బదాలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా చేతిలో ఉంది. 2008లో కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఈ జట్టు విలువ నేడు 24 రెట్లు పెరగడం ఐపీఎల్ బ్రాండ్ పవర్‌కు నిదర్శనం. అయితే ఈ యాజమాన్య మార్పు ప్రక్రియ ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతే అధికారికంగా అమల్లోకి రానుంది.

రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతోంది. కొత్త యజమానుల రాకతో ఫ్రాంచైజీ మౌలిక సదుపాయాలు మరియు గ్లోబల్ బ్రాండింగ్ మరింత మెరుగుపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మున్ముందు ఐపీఎల్ జట్ల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు కూడా విక్రయానికి వచ్చే అవకాశం ఉండటంతో, ఈ డీల్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...