రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' అంట!

posted on: May 1, 2023 5:41PM

 

రాజ్‌ తరుణ్‌ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌ అనే నూతన నిర్మాణ సంస్థ 'పురుషోత్తముడు' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మే 1న రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించింది. రమేష్‌ తెజావత్‌, ప్రకాష్‌ తెజావత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైకు చెందిన హాసిని సుధీర్‌ కథానాయికగా పరిచయం అవుతోంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. 

దర్శకుడు రామ్‌ భీమన మాట్లాడుతూ, "కోవిడ్‌ తర్వాత సమయం తీసుకుని మంచి స్పాన్‌ వున్న కథను రాసుకున్నాను. ఆకతాయి చిత్రం తర్వాత చేస్తున్న సినిమా. మంచి కథ కుదిరింది. పి.జి. విందా కెమెరామన్‌గా పనిచేస్తుండగా, గోపీసుందర్‌ సంగీతపరంగా చక్కటి బాణీలు సమకూరుస్తున్నారు. సినిమా కథకు తగిన హీరో రాజ్‌ తరుణ్‌. కథ పూర్తిగా విన్న తర్వాత ప్రతి సీన్‌ గురించి తిరిగి చెప్పిన ఆయన డెడికేషన్‌ నన్ను ఆకట్టుకుంది. పురుషోత్తముడు అనే మంచి టైటిల్‌తో ముందుకు వస్తున్నాం. పాన్‌ ఇండియా ఆర్టిస్టులను తీసుకుంటున్నాం. మాటలపరంగా చక్కగా టీమ్‌ కుదిరింది. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌, రాజమండ్రి, కేరళలో జరుగుతుంది. ఓ పాటను విదేశాలలో తీయబోతున్నాం. జూన్‌ 1నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది" అని చెప్పారు. 

కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, "దర్శకుడు రామ్‌గారు కథ చెప్పగానే కొత్తగా అనిపించడంతో పాటు ఎగ్జైట్‌మెంట్ కలిగించింది. నిర్మాతలలో మంచి సినిమా తీయాలనే తపన కనిపించిది. ఈ సినిమాతో పి.జి. విందాగారితో పనిచేసే అవకాశం దొరికింది. గోపీసుందర్‌తో పనిచేయడం హ్యాపీ. హీరోయిన్‌ హాసిని తెలుగు నేర్చుకుని సినిమా చేయడం ఆమెకు సినిమాపై వున్న ప్రేమను తెలియజేస్తుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌ అన్నీ వుంటాయి. నేను ఎందులో పురుషోత్తముడు అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే" అన్నారు.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, "గోపీసుందర్‌గారు ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. మలయాళంతోపాటు తెలుగు సినిమాలకు మంచి మెలోడీ ఇస్తున్నారు. ఇందులో ఆరుపాటలుంటాయి. ఈరోజు నుంచి కంపోజింగ్ కూడా మొదలవుతుంది. రాజ్‌తరుణ్‌కు టైలర్‌ మేడ్‌ పాయింట్‌. కథలో బలం వుంది. పురుషోత్తముడు వంటి మంచి టైటిల్‌ రాజ్‌ తరుణ్‌కు అందంగా కుదిరింది." అన్నారు.

నిర్మాత రమేష్‌ తెజావత్‌ మాట్లాడుతూ, "రామ్‌గారు చెప్పిన కథ వినగానే చాలా ఆకట్టుకుంది. ఈ కథ ఇంతవరకు రాలేదని అనిపించింది. అందుకే భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. మా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌లో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకముంది" అని చెప్పారు.

మరో నిర్మాత ప్రకాష్‌ తెజావత్‌ మాట్లాడుతూ, "అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్‌ అయ్యాం. రామ్‌గారు కథ చెప్పగానే నిద్రలోకూడా వెంటాడింది.  అంత చక్కటి కథను తీసుకున్నాం. తెలుగువారితో కలిసి చక్కటి క్వాలిటీ కథతో రాబోతున్నాం. రాజ్‌తరుణ్‌ సినిమాలంటే అందరినీ అలరించే విధంగా వుంటాయి. ఈ సినిమా కూడా అలానే వుంటుంది" అన్నారు.

హీరోయిన్‌ హాసిని మాట్లాడుతూ, "తెలుగులో మొదటి సినిమా నాది. రెండు సంవత్సరాలుగా నన్ను ట్రైన్‌ చేసి దర్శక నిర్మాతలు అవకాశం ఇచ్చారు. వారికి చాలా థ్యాంక్స్‌" అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ పి.జి. విందా మాట్లాడుతూ, "ఫొటోగ్రఫీ, సంగీతం, హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలంటే కథే ముఖ్యం. అది రామ్‌గారి కథలో వుంది. అందుకు తగిన నిర్మాతలు లభించారు. మేకింగ్‌ ది బెస్ట్‌ అడిగారు. నేను ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తాను. సరికొత్త కథకు నిదర్శనంగా పురుషోత్తముడు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పగలను. ఎందుకంటే రామ్ గారు తయారు చేసిన కథ చాలా బాగుంది. కథకు సరైన హీరో కుదిరారు." అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి. విందా, మాటలు: రామస్వామి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్‌, పూర్ణాచారి, ఆర్ట్‌: వెంకటేష్‌ జి., ఎడిటర్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫైట్స్‌: పృధ్వీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంగళరావు, నిర్మాతలు: రమేష్‌ తెజావత్‌, ప్రకాష్‌ తెజావత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ భీమన. 

google-ad-img
    Related Sigment News
    • Loading...