మండుతున్న ఎండలు...తెలంగాణకు మళ్లీ వర్ష సూచన

posted on: Apr 19, 2026 5:28PM

 

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివిధ జిల్లాలకు 'ఆరెంజ్, ఎల్లో అలెర్ట్' జారీచేసింది. అటు మండే ఎండలు, ఇటు అకాల వర్షాలతో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వివిధ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా చల్లబడి, ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానలు ముంచెత్తుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో అధికారులు 'ఆరెంజ్ అలెర్ట్' జారీ చేశారు.


 కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు 'ఎల్లో అలెర్ట్' జారీ చేశారు. వర్ష సూచన ఉన్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎండ తీవ్రత దృష్ట్యా కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...