Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ. 5 కట్ చేస్తే రూ. 10 వేలు జరిమానా! రైల్వే శాఖకు షాకిచ్చిన కోర్టు!
posted on: Jun 17, 2026 11:54AM
(2).webp)
సాధారణంగా ఐదు రూపాయలు తక్కువ వస్తే మనం ఏం చేస్తాం? పోన్లే అని వదిలేస్తాం. కానీ ఒక సామాన్య రైల్వే ప్రయాణికుడు మాత్రం అలా ఊరుకోలేదు. తన హక్కుల కోసం వినియోగదారుల కోర్టు తలుపు తట్టాడు. ఫలితంగా కేవలం 5 రూపాయల రీఫండ్ తక్కువ ఇచ్చినందుకు గాను భారతీయ రైల్వే శాఖకు ఏకంగా 10,000 రూపాయల భారీ జరిమానా పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఆసక్తికరమైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి 28, 2023 న ఒక ప్రయాణికుడు తన కోసం, తన తండ్రి కోసం హిసార్ నుండి లుధియానాకు వెళ్లడానికి రెండు రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డ్ ద్వారా మొత్తం 330 రూపాయలు చెల్లించాడు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణానికి ఒక రోజు ముందే ఆ రెండు టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రైల్వే నిబంధనల ప్రకారం రద్దు ఛార్జీల (Cancellation Charges) కింద 240 రూపాయలు మినహాయించుకుని, అతనికి తిరిగి 90 రూపాయలు వాపసు ఇవ్వాల్సి ఉంది. కానీ అతని బ్యాంకు ఖాతాలో కేవలం 85 రూపాయలు మాత్రమే జమ అయ్యాయి.
కేవలం 5 రూపాయలు తక్కువ రావడంతో ఆ ప్రయాణికుడు రైల్వే అధికారులను, హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాడు. కానీ ఎక్కడా అతనికి సరైన సమాధానం గానీ, వివరణ గానీ లభించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు బాధితుడు న్యాయం కోసం లుధియానా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రైల్వే శాఖ ఒక వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఆ 5 రూపాయలు తాము కట్ చేయలేదని, ప్రయాణికుడి బ్యాంక్ అయిన ఎస్‌బీఐ రీఫండ్ ఫీజుగా వసూలు చేసిందని బుకాయించే ప్రయత్నం చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే రీఫండ్‌లపై 5 రూపాయలు వసూలు చేయడానికి ఎస్‌బీఐకి అనుమతినిస్తూ 2017లో రైల్వే బోర్డు జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌ను కూడా కోర్టుకు సమర్పించింది.
కానీ ఈ వాదనను వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు సంజీవ్ బాత్రా, సభ్యురాలు మోనికా భగత్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. రద్దు చేసిన టిక్కెట్టుపై ఎక్కడా ఇటువంటి అదనపు రుసుము గురించి ప్రస్తావించలేదని కమిషన్ స్పష్టం చేసింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటి మినహాయింపుల సమాచారాన్ని బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు కనిపించేలా ప్రదర్శించాల్సి ఉండగా, రైల్వే శాఖ ఆ పని చేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. చివరికి లుధియానా స్టేషన్ మాస్టర్, డివిజనల్ మేనేజర్ వంటి సీనియర్ అధికారులకే ఈ ఒప్పందం గురించి తెలియదనే విషయాన్ని కమిషన్ ఎత్తిచూపింది.
ఖాతాదారుడికి ముందే సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా డబ్బులు మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ప్రయాణికుడికి ఉన్న 'సమాచారం పొందే హక్కు'ను రైల్వేలు ఉల్లంఘించాయని తేల్చింది. జూన్ 2 నాటి తన ఉత్తర్వుల్లో.. బాధితుడికి ఆ 5 రూపాయల బకాయిని తిరిగి ఇవ్వడంతో పాటు, మానసిక వేదనకు నష్టపరిహారంగా, కోర్టు ఖర్చుల కింద 10,000 రూపాయలు చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ జరిమానా చెల్లించకపోతే, ఆపై రోజుకు 200 రూపాయల చొప్పున అదనపు జరిమానా పడుతుందని కోర్టు హెచ్చరించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది.






