జనరల్ బోగీల్లోనూ ఇక గంటగంటకూ ప్రతి గంటకు క్లీనింగ్

posted on: Feb 16, 2026 8:27AM

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం రైళ్ల శుభ్రతపై తీపి కబురు అందించింది. రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరిచబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఇకపై కేవలం రిజర్వ్‌డ్‌ బోగీలే కాకుండా సామాన్యులు ప్రయాణించే జనరల్‌ బోగీల్లోనూ గంటగంటకూ శుభ్రం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సరికొత్త సంస్కరణల ద్వారా ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్న అశ్వినీవైష్ణవ్.. ఈ  కార్యక్రమాన్ని తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 80  రైళ్లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలా ఎంపిక చేసిన రైళ్లలో  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 5 ముఖ్యమైన రైళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైన ఆరు నెలల తర్వాత మరో 80 రైళ్లకు.. ఆపై మూడేళ్ల కాలపరిమితిలో దేశంలోని అన్ని రైళ్లకు  విస్తరించేందుకు  ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ  ప్రాజెక్టులో భాగంగా ప్రతి రైలులో ఒక ప్రొఫెషనల్ క్లీనింగ్ టీమ్‌తో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు.  బీగోలను క్లీన్ చేసిన తర్వాత ఫొటోలు తీసి వాటిని కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. అక్కడ ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఆ ఫోటోలను విశ్లేషించి, పరిశుభ్రత నాణ్యతకు రేటింగ్ ఇస్తుంది.

అయితే ఈ పనుల కోసం నియమించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. వీటిని పర్యవేక్షించే సూపర్‌వైజర్లకు కనీసం 12వ తరగతి లేదా ఐటీఐ విద్యార్హత ఉండాలని నిబంధన విధించారు.   రైళ్లలో దిండ్లు, దుప్పట్లు సరఫరాతో పాటు చిన్నపాటి మరమ్మతులు వంటి పనులు అన్నింటినీ ఇకపై ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. దీనివల్ల బాధ్యతాయుతమైన సేవలు అందుతాయని అశ్వీనీవైష్ణవ్ అన్నారు.  ఈ ఆధునిక క్లీనింగ్ సేవల కోసం ప్రయాణికులపై ఎలాంటి అదనపు చార్జీల భారం వేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు

google-ad-img
    Related Sigment News
    • Loading...