ఉస్మానియా ముచ్చట తీరిపోవాలి
posted on: Jun 15, 2015 9:30PM

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, తద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఉస్మానియా విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో వుంది. ప్రస్తుతం ఆ ఉస్మానియా విద్యార్థులే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అలాంటి ఉస్మానియా విద్యార్థులను మంచి చేసుకోవడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావచ్చని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళి, ఆయన్ని అక్కడి విద్యార్థులతో మమేకం అయిపోయేలా చేసి వారి మనసులలో స్థానం పొందాలని ఆశిస్తున్నారు. దానికోసం మొన్నామధ్య రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో రాహుల్ ఉస్మానియా సందర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. అసలే ఆగ్రహంగా వున్న ఉస్మానియా విద్యార్థుల దగ్గరకి వెళ్ళడం ఎందుకున్నారో, మరోటోగానీ రాహుల్ గాంధీ అప్పుడు ఉస్మానియా ఛాయలకు రాలేదు.. హైదరాబాద్‌కి కూడా రాలేదు. అప్పుడు ఎందుకు మిస్సయినా, రాహుల్ - ఉస్మానియా విద్యార్థుల భేటీని త్వరలో ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్ళూరుతున్నారు.
త్వరలో రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళాలని టీ కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక రచించారు. రాహుల్ గాంధీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, అక్కడ విద్యార్థి నాయకులను కలిసే ఉత్సాహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి తెలంగాణ ఉద్యమంలో కిందామీదా పడి పోరాటం చేసి వాళ్ళే జడుస్తూ వుంటారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియాకి వెళ్ళే సాహసం చేయబోరు. అలాంటి రాహుల్ గాంధీని ఉస్మానియాకి తీసుకెళ్ళాలన్న ఉత్సాహం టీ కాంగ్రెస్ నాయకులకు రోజు రోజుకూ పెరిగిపోతుంటే, రాహుల్ గాంధీ కూడా వారికి అనుగుణంగానే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి ఉత్సాహం ఒక కొలిక్కి రావాలంటే రాహుల్ గాంధీ ఉస్మానియాకి వస్తేనే బెటర్. అప్పుడుగానీ వారందరి ముచ్చట తీరదు.







.webp)


