రాహుల్ జీ బర్త్ డే.. ఇంతకీ ఆయన ఎక్కడ?
posted on Jun 19, 2025 2:52PM
.webp)
కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజు గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీని తమ ఆదర్శ సోదరునిగా పేర్కొంటే, ఖర్గే రాజ్యంగ పరిరక్షణ కోసం లక్షలాది గొంతుకలను ఒక్కటై వినిపిస్తున్న నాయకుడిగా రాహుల్ గాంధీని అభివర్ణించారు. అలాగే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కష్ట కాలంలో భారతదేశానికి అవసరమైన నాయకుడిగా రాహుల్ గాంధీని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీని నా నాయకుడు అని సంభోదిస్తూ.. రాహుల్ గాంధీ దేశానికి ఆశాకిరణం అని ప్రశంసించారు.
మరో వంక.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పుఅర్కరించుకుని కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలోని తల్కతోరా స్టేడియం లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 20 వేల మంది నిరుద్యోగ యువత తమపేర్లను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జాతీయ యువజన కాంగ్రెస్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 100 పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయనీ.. ఈ మేళా ద్వారా కనీసం 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కుతాయని జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రకటించారు.
అయితే.. బీజేపీ ఢిల్లీ నాయకులు మాత్రం ఇదొక పొలిటికల జిమ్మిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ రాజదాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశం నుంచి పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందనీ, అందుకే ఏదో విధంగా.. ఉన్నామని చెప్పుకునేందుకు, పార్టీ ఉనికిని కాపాడు కునేందుకు హస్తం పార్టీ జిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి జిమ్మిక్కులతో పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని అనుకుంటే పొరపాటే, అవుతుందని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సామాన్య ఢిల్లీ ఓటర్లే విశ్వసించ లేదు. వరసగా ఆరు (మూడు లోక్ సభ, మూడు అసెంబ్లీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సున్నా సీట్లతో సత్కరించిన విషయాన్ని మరిచిపోరాదని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు.
మరోవంక సోషల్ మీడియాలో ఓ వంక రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే, మరో వంక రాహుల్ ఎక్కడ? ఏ దేశంలో ఉన్నారు? జార్జి సోరోస్ కుమారుడి వివాహానికి వెళ్ళింది నిజమేనా? అంటూ అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడని సైటర్లు వేస్తున్నారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవం రోజున, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. ఇలా అనేక కీలక సందర్భాల్లో రాహుల్ గాంధీ తరచూ జరిపే రహస్య విదేశీ పర్యటనలపైన నెటిజన్లు.. ఎవరికీ తోచిన విధంగా వారు రియాక్ట్ అవుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు.