రాహుల్‌ సభలో మాజీ డిప్యూటీ సీఎంకు అవమానం... ఆలస్యంగా వెలుగులోకి...

 

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం విడిపోవడానికి ముందున్న కాంగ్రెస్ సర్కారులో నెంబర్ టూ. అలాంటి వ్యక్తిని సంగారెడ్డి కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో పక్కనబెట్టేశారు. రాహుల్ పాల్గొన్న కీలక సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహది ప్రేక్షక పాత్రే అయ్యింది. సభ జరిగింది స్వయానా దామోదర సొంత జిల్లాలోనే. అయితే ఈ సభలో రాహుల్ రావడానికి ముందు.....రాహుల్ వచ్చాక చాలా మంది నేతలు మట్లాడారు. మెదక్ జిల్లా నేతలతో పాటు ఆ జిల్లాకు చెందని వారు కూడా ప్రసంగాలు దంచేశారు. కానీ దామోదరునికి మాత్రం మైకు పట్టుకునే అవకాశం రాలేదు.

 

నిజానికి సంగారెడ్డి సభ ఏర్పాట్లలో దామోదర రాజనర్సింహ చాలా చురుగ్గా పాల్గొన్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న సభ కావడంతో చాలా ఉత్సాహం కనబరిచారు. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఎవరికీ కాకుండా పోయారు. ఓ సాధారణ నేతలా స్టేజీపైన కూర్చుండిపోయారు. రాహుల్ కు జరిగిన సన్మాన కార్యక్రమాల్లో కానీ ...స్టేజిపై మాట్లాడే విషయంలో కానీ మాజీ డిప్యూటీకి అస్సలు అవకాశం దక్కలేదు. అయితే పార్టీ నేతలే ఆయన చేత మాట్లాడించలేదా..? ఆయనే ప్రసంగానికి దూరంగా ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

అయితే రాహుల్ సభలో దామోదరను పక్కన పెట్డానికి అంతర్గత కుమ్ములాటలే కారణమని పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఏదిఏమైనా రాహుల్‌ పాల్గొన్న సభలో దళిత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతను దూరంగా ఉంచడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu