ఎన్నికల్లోపు మరో నాలుగైదు... రాహుల్‌ టూర్‌ సక్సెస్‌తో టీకాంగ్రెస్‌లో జోష్‌...

రాహుల్‌ టూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేలు ఖుషీ అవుతున్నారు. సంగారెడ్డి సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందంటున్న టీకాంగ్‌ నేతలు... ఇలాంటి సభలు ఎన్నికల్లోపు ఆరేడు పడితే ప్రజల్లోకి మన వాయిస్‌ బలంగా వెళ్తుందని, పార్టీ ఊహించని విధంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. రాహుల్‌ తన ప్రసంగంలో కేసీఆర్‌ ఫ్యామిలీని ఏకిపారేశారని, అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించే విధంగా మాట్లాడారని అంటున్నారు. ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర నేతలే ప్రిపేర్‌ చేసినప్పటికీ... సూటిగా సుత్తి లేకుండా పాయింట్‌ టు పాయింట్‌ ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు.

 

ముఖ్యంగా హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం... కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయంటున్నారు. ఒక్క కుటుంబం కోసమేనా... తెచ్చుకుంది... ఆ నలుగురి కోసమే నాలుగు కోట్ల ప్రజలు పోరాటాలు చేయాలా అంటూ రాహుల్‌ సంధించిన ప్రశ్నలు... జనంలో ఆలోచనను రేకెత్తించాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ శక్తి, వనరులు, ప్రజల ఆశలు, కలలు, మీ పిల్లల భవిష్యత్‌, అధికారాలు అన్నీ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యాయన్న రాహుల్‌... ఇదేనా మీరు కోరుకున్న తెలంగాణ అంటూ ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించగలిగారని అంటున్నారు.

 

ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు గురించి మాట్లాడిన రాహుల్‌... అన్నదాతల ఆత్మహత్యలతో తెలంగాణ స్మశానంగా మారుతోందన్నారు. ఈ మూడేళ్లలో 2వేల 855మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే... అందులో ఒక్క కేసీఆర్‌ నియోజకవర్గంలోనే వంద మంది ఉన్నారని ఆరోపించారు. మద్దతు ధర అడిగితే సంకెళ్లు వేసి జైల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్న రాహుల్‌.... ఇదేం రుణమాఫీ అంటూ ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరికో ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. రీడిజైనింగ్‌ పేరుతో దోచుకుంటున్నారని... ఇదేనా బంగారు తెలంగాణ అంటే అంటూ నిలదీశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచి... ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నారంటూ రాహుల్‌ ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్న రాహుల్‌... తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన  విద్యార్ధులకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి... 4వేల స్కూళ్లను మూసేశారంటూ ఆరోపించారు. ల్యాండ్‌ మాఫియా, పార్టీ ఫిరాయింపులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరి అధికారాలను లాక్కుని... ఆ నలుగురే అధికారం అనుభవిస్తున్నారంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాయి. ఆర్ధిక జల భూవనరులపై హక్కులు, బంగారు భవిష్యత్‌ కోసం ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే.... కేసీఆర్‌ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్లుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

మొత్తానికి కేసీఆర్‌ ఫ్యామిలీ టార్గెట్‌గా సాగిన రాహుల్‌ స్పీచ్‌.... తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే తరహాలో ఎన్నికల్లోపు కనీసం నాలుగైదు సభలు రాహుల్‌ చేత నిర్వహిస్తే... పార్టీ పుంజుకునే అవకాశముంటుందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu