మోడీ నట్టింట.. రాహుల్ భూకంపం..!

posted on: Dec 21, 2016 5:52PM

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు కుప్పలు తెప్పలుగా పోగుపడుతున్న నల్లధనానికి అరికట్లే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ.1000, రూ.500 ల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పాత నోట్లను డిసెంబర్ 31 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..అప్పటి నుంచి జనం తిప్పలు వర్ణనాతీతం..పాత నోట్లు మార్చుకోవడానికి, డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి తిండి, తిప్పలు మాని బ్యాంకులు, ఏటిఎం వద్ద పడిగాపులు పడుతున్నారు. అయినా డబ్బు దొరుకుతుందనే ఆశ లేదు. మొదట్లో మోడీ నిర్ణయాన్ని సమర్థించిన జనం..నిత్యావసరాలకు డబ్బులు దొరక్క తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు..దీంతో ఏ నోటితో అయితే పొగిడారో..అదే నోటితో మోడీని విమర్శిస్తున్నారు.

 

అటు మోడీని ఎలా టార్గెట్ చేయాలా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ఈ వ్యవహారంతో స్వయంగా ప్రధానే అస్త్రాన్ని అందించినట్లైంది. దీనిని సద్వినియోగపరచుకున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంట్‌‌ శీతాకాల సమావేశాల్లో బీజేపీని బాగానే ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో తాను నోరు విప్పితే భూకంపం వస్తుందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా ఆ మాట నిజం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లోని మెహసానాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ 2013-14 మధ్యకాలంలో మోడీకి భారీగా ముడుపులు ముట్టాయని సంచలన ఆరోపణలు చేశారు. మోడీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్లు సహారా కంపెనీ ఉద్యోగుల డైరీల్లో ఆధారాలు లభించాయని రాహుల్ ఆరోపించారు. ఈ వివరాలన్ని ఆదాయపుపన్ను శాఖ రికార్డుల్లో పడి ఉన్నాయని కానీ దీనిపై ఎటువంటి చర్యా తీసుకోలేదని ఆయన అన్నారు.  ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విడతలవారీగా నగదు ముట్టిన తేదీలతో కూడిన వివరాలతో ట్వీట్ చేశారు. దీనిలో వాస్తవమెంతో తెలియదు గానీ ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...