రాహుల్ గాంధీ ఇంగ్లీష్ వింగ్లీష్
posted on Aug 14, 2015 1:16PM
.jpg)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఇటలీ నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు. కనుక ఆమె మాట్లాడేందుకు కొంచెం ఇబ్బంది పడటం సహజమే. కనుక ఆమె తన హిందీ ప్రసంగ పాఠాలను తన మాతృబాష అయిన ఇటలీ బాషలోనో లేక ఇంగ్లీషు బాషలోనొ వ్రాసుకొని చదివితే ఆమెను తప్పు పట్టడానికి లేదు. విదేశీయురాలైనప్పటికీ ఆమె మన దేశ బాష నేర్చుకొని అంత చక్కగా మాట్లాడటం, ఏదో విధంగా రాజకీయ ప్రసంగాలు కూడా చేయడాన్ని మెచ్చుకోవలసిందే.
కానీ ఆమె కుమారుడు ఇక్కడే భారత్ లోనే పుట్టాడు. పైగా నెహ్రు వంశాకురం. దేశానికి ప్రధానికావాలని కలలు కంటున్న వ్యక్తి. కనుక అతను హిందీలో చాలా అనర్గళంగా ప్రసంగాలు చేస్తుంటారు. హిందీపై మంచి పట్టుకూడా ఉన్నట్లే కనబడుతారు. కానీ చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన బహిరంగ సభలలో హిందీలో రాజకీయ ప్రసంగాలు చేయవలసి వస్తే దానిని ఆయన ఇంగ్లీషులో వ్రాసుకొని చదువుతున్న సంగతి ఈ మధ్యనే బయటపడింది. “లోగ్ మోడీకే రాయ్ జాన్నా చాహితే హై” అనే పదాలను ఆయన యధాతధంగా ఇంగ్లీషులో వ్రాసుకొని దానిని హిందీలో చదువుతారన్న మాట! ఇంగ్లీష్ మీడియం చదువుల కారణంగా ఇప్పటితరం పిల్లలలో చాలా మందికి తమ మాతృబాషలో మాట్లాడటం వచ్చినా చదవటం, వ్రాయడం రాదని అందరికీ తెలిసిందే. అందుకు రాహుల్ గాంధీ కూడా అతీతుడు కాదని రుజువయింది. అంతే!