రాహుల్ ఓదార్పు యాత్రలకి జగనే ప్రేరణా?
posted on May 15, 2015 12:50PM
.jpg)
జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, రైతు భరోసా యాత్రల గురించి ఆ నోటా ఈ నోటా ప్రాకి చివరికి ఆ విశేషాలు డిల్లీలో రాహుల్ గాంధీ చెవిలో పడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోని రాహుల్ గాంధీ ఇప్పడు వాటిపై ఆసక్తి కలిగినట్లుంది. జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రలు, ఇప్పుడు రైతు భరోసా యాత్రల ద్వారా రాష్ట్రంలో తన పార్టీని ఏవిధంగా బలపరుచుకొంటున్నారో ఇప్పుడు తను కూడా అదే విధంగా కిసాన్ యాత్రలతో రెండు నెలల శలవుతో డ్యామేజి అయిన తన ఇమేజిని, ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన తన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మండే ఎండల్లో చెమటోడ్చుతున్నారు పాపం.
కానీ ఈ హడావుడిలో రాహుల్ గాంధీ ఒక ముఖ్యమయిన విషయం మరిచిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా చేసిన ఓదార్పు యాత్రల వలన వైకాపా బలపడగలిగిందే తప్ప ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయింది. కనుక ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఫ్లయింగ్ పాదయత్రల వలన ఆయననుకొన్న ప్రయోజనం దక్కుతుందా? అంటే అనుమానమే. కనుక ఒకవేళ ఆయన నిజంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే, ఒక్కో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అక్కడి నేతలతో కలిసి సమీక్షించి, అక్కడ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఏమి చేయాలో అది చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. లేదా జగన్మోహన్ రెడ్డిలాగే రాహుల్ గాంధీ కూడా ఒక్కో రాష్ట్రంలో కొన్ని రోజులపాటు ఏకధాటిగా పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసినా ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ ఇటువంటి ఫ్లయింగ్ పాదయత్రలు, పరామర్శ యాత్రల వలన, స్థానిక కాంగ్రెస్ నేతలకు, ప్రభుత్వానికి తడిపిమోపెడు ఖర్చు తప్ప మరే ప్రయోజనం ఉండబోదని రాజకీయ వర్గాలలోనే ఒక టాక్ వినిపిస్తోంది.