రాహుల్‌గాంధీ నిర్ణయం కరెక్ట్!
posted on May 4, 2015 7:53PM

భారత రాజకీయాలలో రాహుల్ గాంధీకి వున్న ‘విలువ’ ఏమిటో అందరికీ తెలిసిందే. గతించిన నాయకులను వదిలేస్తే, సోనియాగాంధీ ముద్దుల కొడుకు కావడం మినహా ఆయనకు వున్న ప్రత్యేకత ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో తలపండిన నాయకులెందరో వున్నారు. వారెవరితోనూ పోల్చగలిగే స్థాయి ఆయనకు లేదని అంటాను. తలపండిన నాయకుల సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్తకు వున్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా రాహుల్ గాంధీకి లేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి రాహుల్ గాంధీ అనేకసార్లు తన రాజకీయ అపరిపక్వతను నిరూపించుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఆయన్ని ప్రజల ముందు ఒక ‘మొద్దబ్బాయి’గా ప్రొజెక్ట్ చేసి సక్సెస్ అయింది. తన మీద ఇలాంటి ముద్ర వుందని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ దానిని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా, తన మాటలు, చేతలతో ఆ ‘ముద్ర’ మరింత బలపడేలా చేసుకుంటున్నారు.
ఇదిలా వుంటే ఆయన ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా ‘సెలవు’ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడకి వెళ్ళారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు. బహుశా ఆయన ఏ దేశంలోనో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి వుంటారని అందరూ భావించారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ ‘రాహుల్ గాంధీ కనిపించడం లేదు’ అని కామెడీ చేసే పరిస్థితి వచ్చింది. యుపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టినెన్స్‌ని చించిపారేయడంతోపాటు అనేక విషయాలలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇన్నాళ్ళ తర్వాత రాహుల్ గాంధీ ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. అదే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలనే నిర్ణయం. ఈ సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్ణయం చాలా సమంజసమైన నిర్ణయం. ఎందుకంటే, ఆయన చాలాకాలంపాటు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల ఆయన కాస్త లావై వుంటారు. ఇప్పుడు పాదయాత్రలు చేయడం వల్ల విశ్రాంతి తాలూకు ఫ్యాట్ మొత్తం కరిగిపోయే అవకాశం వుంటుంది. తద్వారా ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భారీ విశ్రాంతి తర్వాత బాగా వాకింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ అభినందనీయుడు.