మోడీకి రాహుల్ ఉచిత సలహా
posted on Apr 30, 2015 2:08PM
.jpg)
దాదాపు రెండు నెలలు రాజకీయాల నుండి శలవు తీసుకొని విదేశాలకు వెళ్లి సేద తీరివచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రైతుల సమస్యలపై లోక్‌సభలో మాట్లాడుతూ “నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలు కాస్త తగ్గించుకొని దేశంలో వివిధ రాష్ట్రాలలో పర్యటించి రైతుల కష్టసుఖాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుందని” ఉచిత సలహా ఇచ్చేరు. ఆయన చేసిన సూచనకు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ చాలా ధీటుగా బదులిచ్చారు. “గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ విషయం గురించి ఎందుకు ప్రశ్నించలేదు?”అని నిలదీశారు.
రాహుల్ గాంధీ తలుచుకొంటే గత పదేళ్ళలో రైతులకు మేలు కలిగించే పనులు అనేకం చేసి ఉండవచ్చును. కానీ అప్పుడు రైతుల కోసం ఆయన చేసిందేమీ లేదు. యూపీఏ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా కూడా ఆయన చేతులు ముడుచుకొని కూర్చొన్నారే తప్ప ఎన్నడూ అడ్డుపడలేదు. కనీసం ప్రశ్నించలేదు. గత పదేళ్లుగా ఆయన కోసమే ప్రధానమంత్రి కుర్చీని ఆయన తల్లి సోనియాగాంధీ రిజర్వు చేసి పెట్టినా అందులో కూర్చొనే సాహసం చేయలేకపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా తరువాత కూడా ఆయన లోక్ సభ వెనుక బెంచీలలో కూర్చొని కునుకు తీసారే తప్ప రైతుల కోసం మాట్లాడలేదు.
ఒక ప్రధాన జాతీయ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ కీలకమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విదేశాలలో చక్కర్లు కొట్టి వచ్చిన తరువాత ఇప్పుడు తనకంటే ఎన్నో రెట్లు సమర్ధుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనాదక్షుడయిన ప్రధాని మోడీని విదేశీ పర్యటనలు తగ్గించుకొని, రైతుల గురించి ఆలోచించమని ఉచిత సలహాలు ఇవ్వడం చాలా హాస్యాస్పదం. బహుశః మోడీని విమర్శించగలిగితేనే తనకు చాలా దైర్యం, నాయకత్వ లక్ష లక్షణాలు ఉన్నాయని నిరూపించదలచుకొన్నారో ఏమో?
గత పదేళ్ళుగా రైతులను పట్టించుకోని రాహుల్ గాంధీ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతూ ఓ వందమంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకొని జనరల్ బోగీలో ప్రయాణాలు చేస్తూ, రైతులను పరామర్శించేందుకు పాదయాత్రలు మొదలుపెట్టారు. దాని వలన రైతుల కష్టాలు తీరకపోయినా రాహుల్ గాంధీకి మాత్రం కావలసినంత ఉచిత పబ్లిసిటీ దొరుకుతుంది.