రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పయనమెటు?

posted on: Jun 30, 2014 5:42PM

 

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కారకుడని కొంత మంది కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టాన దేవుడిగా కొలవబడుతున్న రాహుల్ గాంధీని విమర్శించినందుకు వారికి వెంటనే పార్టీ నుండి ఉద్వాసన చెప్పడం ద్వారా ఆ సమస్యను అధిగమించినట్లు కాంగ్రెస్ భావించింది, కానీ నాయకత్వ లోపం గురించి సదరు నేతలు లేవనెత్తిన అంశాన్ని మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అనిపించుకోదు కదా! సమస్య ఇంకా అలాగే ఉంది గనుక అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఈ విషయమై సన్నాయి నొక్కులు నొక్కడం సహజమే. అయితే ఈసారి రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి వేరెవరో కాదు, గత పదేళ్లుగా ఆయనపై ఈగ వాలకుండా చూసుకొన్న దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీకి అధికారం బాధ్యతలు చెప్పట్టగల లక్షణాలు లేవని విమర్శించారు. ఎన్నికలు ముగిసే వరకు కూడా రాహుల్ గాంధీ వంటి నాయకుడు నభూతో నభవిష్యతి అని డప్పుకొట్టిన దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత అతనికి పరిపాలనా సామార్ధ్యం లేదని చెప్పడం చూస్తే, అతను అసమర్ధుడని పార్టీలో నేతలందరికీ తెలిసి ఉన్నప్పటికీ, సోనియా గాంధీకి భయపడి అందరూ ఆయన భజనలో తరించిపోయినట్లు స్పష్టమవుతోంది. కానీ ప్రజలు అతను ప్రధానిగా దేశాన్ని పాలించేందుకు అనర్హుడని సరిగ్గానే అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి అవినీతి, అసమర్ధత, అక్రమాలతో బాటు నాయకత్వ లక్షణాలు లేని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనుకోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చును.

 

 

ఇక దిగ్విజయ్ సింగ్ ఆరోపణల విషయానికి వస్తే “రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించేందుకు అవసరమయిన సామర్ధ్యం లేకపోయినప్పటికీ, ఆయన న్యాయం కోసం పోరాడటంలో దిట్ట. కానీ లోక్ సభలో పార్టీకి నాయకత్వ వహించకపోవడం మంచి నిర్ణయం కాదు,” అని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కలకలం సృష్టించాయి. దానికి దిగ్విజయ్ మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవడం వంటివి షరా మామూలే. కానీ సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు ఇటువంటి విమర్శలు చేయడం గమనిస్తే, రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నంత కాలం పార్టీకి భవిష్యత్తు లేదని వారు కూడా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వచ్చే ఐదేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధమయిన పరిపాలన అందించగలిగినట్లయితే, ఇక రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి శనిమహర్ధశ మొదలయినట్లేనని భావించవచ్చును. అయితే ఈ విషయాన్ని అందరికంటే ముందుగా దిగ్విజయ్ సింగ్ పసిగట్టడమే చాలా నవ్వు తెప్పిస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...