కాంగ్రెస్ హస్తంలో వైకుంటం చూపిన రాహుల్
posted on Apr 25, 2014 9:43PM
.jpg)
రాహుల్ గాంధీ నాలుగు రోజుల వ్యవదిలో తెలంగాణాలో మూడు సభలలో పాల్గొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణా వచ్చిందనేది మూడు సభల సారాంశం. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణా ప్రజల 60 ఏళ్ల కల ఎన్నటికీ నెరవేరేదేకాదని ఆయన గ్యారంటీ ఇచ్చారు. తెరాస కంటే తమ పార్టీ నేతలే తెలంగాణా ఇవ్వమని డిమాండ్ చేసారని, ఆ తరువాతే తెరాస పార్టీ ఏర్పడిందని ఆయన కనిపెట్టిన కొత్త విషయం ప్రజలకు చాటి చెప్పారు. తెరాస నేతలు కనీసం తెలంగాణా బిల్లు డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా కల్పించుకోలేదని, ఇక పార్లమెంటులో తెలంగాణా కోసం వారు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని తెలియజెప్పారు.
పది సం.ల క్రితం సోనియాగాంధీ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడినందునే తెలంగాణా ఏర్పడిందని ఆయన నొక్కి చెప్పారు. అంతే గాక రాగల పది సం.లలో తాము తెలంగాణకు ఏమేమి చేయబోతున్నమో కూడా చెప్పారు. ఇంతవరకు తెలంగాణా ప్రజలు చైనా దేశంలో తయారయిన మొబైల్స్, వాచీలు, బూట్లు, బట్టలు వాడుతున్నారని కానీ తాను మాత్రం త్వరలోనే ‘మేడ్ ఇన్ తెలంగాణా’ వాచీని ధరించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాని ఆయన అన్నారు.
తెరాస లక్ష రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే, తాము రెండు లక్షలు మాఫీ చేస్తామని, ఇతర పార్టీలు ఎటువంటి అవగాహన లేకుండా విద్యుత్ సరఫరాపై ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని, తాము మాత్రం దేశంలోకెల్లా అతిపెద్ద పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తి సంస్థను స్థాపించి తెలంగాణకు విద్యుత్ కోరతనేది లేకుండా చేస్తామని, వ్యవసాయానికి రోజుకి 9గంటలు పగలే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పనులన్నీ గత పదేళ్ళలో ఎందుకు చేయలేకపోయారో చెప్పగలిగితే ప్రజలు కూడా విని సంతోషించేవారు.