రాహుల్ కి భజన చేసే తొందర్లో… ‘పప్పు’లో కాలేసిన కాంగ్రెస్ నేత!
posted on Jun 13, 2017 2:39PM
.jpg)
ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. తెలివిగా వాడుకుంటే శత్రువులపై ఆయుధాలుగా పనికొస్తాయి. తెలివితక్కువగా ప్రయోగిస్తే మన మీదకే తిరిగొచ్చి చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు అలాంటి చుక్కల్నే పట్టపగలు చూసేస్తున్నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కాంగ్రెస్ నేత వినయ్ ప్రధాన్!
ఆయన వాట్సప్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గ్రూపులో తెగ చర్చనీయాంశమైంది. అందుక్కారణం… ఆ పోస్ట్ లో మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన వినయ్ ప్రధాన్ రాహుల్ ను ఆహా ఓహో అంటూ పొగడటమే. గాంధీ వారసుడైన తమ యువనేత రైతు బాంధవుడనీ, ఇంకా చాలా చాలా గొప్పగా వర్ణించాడు. కాని, అంతా బాగానే నడిచినప్పటికీ ... ఒక చిన్న పొరపాటు కొంపముంచింది! ఆ వాట్పప్ పోస్టులో రాహుల్ ను పనిలో పనిగా పప్పు అని కీర్తించాడట... సదరు కాంగ్రెస్ నేత!
బీజేపి నేత సుబ్రమణ్యం స్వామి ఓ సారి సరదాగా రాహుల్ ని పప్పు అన్నాడు. అప్పట్నుంచీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ వ్యతిరేకులు, మోదీ భక్తులు సోనియా తనయుడ్ని పప్పు అనటం మామూలైపోయింది. కాని, విచిత్రంగా తమ నేతని పొగడటానికి వాట్సప్ లో పెట్టిన పోస్టులో కాంగ్రెస్ నాయకుడే పప్పూ అనటం చాలా మంది కాంగ్రెస్ ఫ్యాన్స్ కి మంట పుట్టించింది. వెంటనే వాట్సప్ గ్రూపులో వినయ్ ప్రధాన్ ను తిట్టటం మొదలు పెట్టారు రాహుల్ ఫ్యాన్స్! అయితే, జరిగిన పొరపాటు ఏంటో ఆలస్యంగా గ్రహించిన కాంగ్రెస్ మీరట్ జిల్లా అధ్యక్షుడు వివరణ ఇచ్చుకున్నాడు…
వాట్సప్ లో రాహుల్ ని కీర్తిస్తూ తానసలు పోస్టే పెట్టలేదనీ, అది అనురాగ్ అనే మరో వ్యక్తి పెట్టాడనీ చెప్పుకొచ్చాడు. అందులో వున్న పప్పూ అన్న పదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. అయినా కాంగ్రెస్ అభిమానులు ఎవ్వరూ వినటం లేదట! వాట్సప్ లో కూర్చుని తమ స్వంత నాయకుడ్నే పప్పు అంటూ పిచ్చి వేషాలు వేస్తే… నీ పప్పులు ఉడకవ్ అంటూ హెచ్చిరిస్తున్నారట!