సోనియా, రాహుల్ ప్రచారంతో ఓట్లు రాలుతాయా?

 

ఈరోజు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మొదట వరంగల్‌లో పార్టీ తరపున ప్రచార సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ క్రిందటి సారి తన పర్యటనలో కేసీఆర్ నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించి, టీ-కాంగ్రెస్ నేతల ఆత్మవిశ్వాసం పెంచగలిగారు. అదేవిధంగా జాతీయ పార్టీ అయిన తమ పార్టీ మాత్రమే తెలంగాణా త్వరగా అభివృద్ధి చేయగలదని, ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల సాధ్యం కాదని గట్టిగా నొక్కి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే దేశంలో, రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నపటికీ చేయలేని అనేక అభివృద్ధి పనులను ఇప్పుడు తమకు ఓటేస్తే చేసి చూపుతామని చెపుతూ, వాటికి మరికొన్ని కొత్తగా జోడించి తెలంగాణ ప్రజలకు తమ హస్తంలో వైకుంటం చూపించేరు. బహుశః ఈరోజు సభలలో కూడా అవే విషయాలు మరోమారు వల్లెవేయవచ్చును.

 

అయితే ఆయన వెళ్ళిన తరువాత మోడీ తెలంగాణాలో ప్రచారసభలు నిర్వహించి, తెలంగాణా కోసం వందల మంది యువకులు చనిపోతున్నపటికీ, పదేళ్ళ పాటు నిర్లిప్తంగా చూస్తూ కూర్చొని 1100 మంది యువకులను పొట్టన పెట్టుకొన్న పాపాత్మురాలు కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణాను, ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఉద్యమాలు మొదలయ్యాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కనుక రాహుల్ గాంధీ ఈరోజు సభలలో బీజేపీ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపాపై బాణాలు వేయవచ్చును. పనిలోపనిగా కేసీఆర్ చేసిన ప్రతివిమర్శలకు కూడా ధీటుగా బదులివ్వవచ్చును.

 

అయితే రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు, నేతలకు తన ప్రసంగంతో ఉత్సాహం కలిగించవచ్చునేమో కానీ, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటు ప్రభావంలో ఉన్న తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చేయలేరని చెప్పవచ్చును. ఆ పని కేవలం టీ-కాంగ్రెస్ నేతల వలననే సాధ్యమవుతుంది. వారు కాంగ్రెస్ జెండా, సోనియా, రాహుల్ గాంధీల ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నపట్టికీ, వారు ప్రధానంగా తమ స్వశక్తి, పలుకుబడితోనే ఎన్నికలలో విజయం సాధించగల సమర్ధులు. ప్రస్తుతం వారందరూ తమ తమ నియోజకవర్గాలలో ఆ పని మీదనే ఉన్నారు. అందువల్ల రాహుల్, సోనియాగాంధీల ప్రచారం కేవలం కాంగ్రెస్ ప్రత్యర్ధులను బలంగా డ్డీకొని, ప్రజలకు అరచేతిలో వైకుంటం చూపించడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడదనే భావించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu