జైట్లీ గైట్లీ నై జాంతే.. నా మాటే ఫైనల్ !

posted on: Feb 2, 2016 12:07PM

కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయరాదన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం పెద్దగా ఆశ్యర్యం కలిగించడం లేదు. స్టాక్ మార్కెట్ కూడా అంతగా ప్రభావితం కాలేదు. తక్షణ స్పందనగా సూచీలు అతి స్వల్పంగా క్షీణించాయి. ఈ నెల 29న కేంద్ర బడ్జెట్ ఉన్నందున,  రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్  నిర్ణయించుకుని ఉండవచ్చు. మంగళవారం నాటి నిర్ణయం వల్ల  రుణాల, డిపాజిట్ల వడ్డీరేట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.  రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు అన్నా తగ్గుతుందని ఆశావహులు అంచనా వేశారు.( 100 బేసిస్ పాయింట్లు ఒక పర్సంటేజ్ పాయింటుకు సమానం). రెపో రేటు 6.75 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు రఘురామ్ రాజన్ చెప్పారు.

రెపో రేటు అంటే...  బ్యాంకులు ఆర్బీఐ నుంచి నిధులు అప్పుగా తీసుకుంటే వాటి మీద చెల్లించాల్సిన వడ్డీరేటు. రెపో రేటు తక్కవగా ఉంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి చౌకగా నిధులు సమకూర్చుకుని తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకి పారిశ్రామిక రుణాలు, హౌస్ లోన్లు, ఇతరత్రా రుణాలు ఇవ్వగలవు. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా 4 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని పరపతి విధాన ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. బ్యాంకులు తాము డిపాజిటర్ల నుంచి సమీకరించే నిధుల్లో కొంత శాతాన్ని రిజర్వు బ్యాంకు వద్ద నగదు రూపంలో జమ చేసితీరాలి. వీటి మీద ఆర్బీఐ బ్యాంకులకు కొంత వడ్డీ చెల్లిస్తుంది. ఇది కూడా ఎకానమీలో నిధుల లభ్యతను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఒక ప్రధాన సాధనం.

2015 క్యాలెండర్ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించి వ్యవస్థలో లిక్విడిటీ పెంచడానికి ప్రయత్నించింది. టోకు ధరల సూచీ వరుసగా 14 నెలల నుంచి నెగెటివ్ జోన్లో ఉంటోంది. డిసెంబర్లో కూడా టోకు దరల సూచీ 0.73 శాతం క్షీణించింది. అయితే, ఈ క్షీణత ఏడాదిలో కెల్లా అతి తక్కువ. ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల క్షీణత శాతం తగ్గింది. ఆహార ధరల ఉప సూచీ నవంబర్లో 5.2 శాతం పెరగ్గా,  డిసెంబర్లో అమాంతం 8.17 శాతం హెచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులు తిరిగి తలెత్తుతున్నాయనడానికి ఇదొక సంకేతంగా భావించడం కూడా రఘురామ్ రాజన్ రేట్లలో మార్పు చేయకపోవడానికి మరొక కారణం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్ట్రియల్ ప్రొడక్షన్)  క్రమంగా తగ్గిపోతోంది. గడచిన నవంబర్లో 3.2 శాతం క్షీణించింది. వ్యవస్థలో లిక్విడిటీ.. నిధుల లభ్యత.. తగినంతగా మెరుగుపడక పోవడం వల్లే తయారీ, మౌలిక సదుపాయాల రంగాలు కుంటినడక నడుస్తున్నాయి. ప్రస్తుతం జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) రేటు బాగానే ఉన్నప్పటికీ,  ఈ పరిస్థితిని విస్మరిస్తే ఎకానమీ తిరిగి మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని పరిశ్రామిక రంగం భయపడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా కీలక రేట్లను అంటే రెపో సీఆర్ఆర్ రేట్లను తగ్గించవలసిందిగా సంకేతప్రాయంగా చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ అనుకున్న స్థాయిలోనే ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున వడ్డీరేట్లు తగ్గేందుకు రిజర్వు బ్యాంకు మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాననుకున్నదే చేస్తారు. ఆయన తనదైన శైలిలోనే వ్యవహరించారు. కీలక రేట్లను తగ్గించలేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...