బీజేపీలో చేరిన చద్దాకు భారీ షాక్...10 లక్షలు తగ్గిన ఫాలోవర్లు

posted on: Apr 25, 2026 4:31PM

 

కమలం గూటికి చేరిన రాఘవ్ చద్దాపై నెటిజన్ల అసహనం...

తగ్గుతున్న క్రేజ్.. సోషల్ మీడియాలో 'అన్ ఫాలో' ఉద్యమం.

రాజకీయాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం సాధారణమే అయినా, ఆ నిర్ణయాల ప్రభావం ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్న 24 గంటల్లోనే ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నిన్నటి వరకు ఆయనను ఆరాధించిన అభిమానులు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఆయనను అన్ ఫాలో చేయడం ప్రారంభించారు. కేవలం ఒకే రోజులో సుమారు పది లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను ఆయన కోల్పోయారు. 14 మిలియన్లుగా ఉన్న ఆయన ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 13.4 మిలియన్లకు పడిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాఘవ్ చద్దాకు ఉన్న 'యూత్ ఐకాన్' ఇమేజ్ ప్రధానంగా జెన్-జీ (Gen-Z) యువతలో ఉంది. రాజ్యసభలో సామాన్యుల సమస్యలను, ముఖ్యంగా డేటా పరిమితులు, ట్రాఫిక్ ఇబ్బందులు, గిగ్ వర్కర్ల వేదన వంటి అంశాలను ఆయన బలంగా ప్రస్తావించేవారు. ఒకానొక దశలో బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా పనిచేసి వారి కష్టాలను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా ఆయన యువతకు అత్యంత చేరువయ్యారు.

అయితే, ఇప్పుడు అదే యువత ఆయన పార్టీ మార్పును జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ మారిన వెంటనే, గతంలో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన సుమారు 62 పోస్టులను డిలీట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది అవకాశవాద రాజకీయమని, నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని విమర్శిస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం '#unfollowRaghavChadha' అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. పలువురు ప్రముఖులు సైతం ఆయనను అన్ ఫాలో చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. "ఇంటర్నెట్ రాత్రికి రాత్రే హీరోని చేయగలదు, అదే వేగంతో జీరోని కూడా చేయగలదు" అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలోనే ఆయనను సొంతంగా 'జెన్-జీ పార్టీ' పెట్టమని అభిమానులు కోరినప్పుడు, ఆయన ఆ దిశగా ఆలోచించకపోవడం ఇప్పుడు ఆయన పాపులారిటీని దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన చద్దా, ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన తర్వాత తన ఇమేజ్‌ను ఎలా కాపాడుకుంటారో, తగ్గుతున్న ఆదరణను ఎలా పుంజుకుంటారో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...