చారిత్రక సత్యాల అన్వేషణ వర్సెస్ సామాజిక సామరస్యం

posted on: May 19, 2026 1:03AM

ప్రార్థనా స్థలాల వివాదాలపై ప్రత్యేక విశ్లేషణ

 ప్రస్తుతం ఇండియాలో ప్రాచీన చరిత్ర, రాజ్యాంగం,  చట్టాలు,  ప్రజా విశ్వాసాల చుట్టూ జరుగుతున్న చర్చలు సరికొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి. గతంలో కేవలం   ఒక్క అయోధ్య వివాదంతో ముగిసిపోతుందని భావించిన ఆలయం, మసీదు వివాదాలు.. కాలక్రమేణా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ వస్తున్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి క్లిష్టమైన సమస్య నుండి మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం వరకూ.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిసరాలలో ఉన్న జామా మసీదు నుండి దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడాల వరకూ..  ఈ వివాదాల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. స్థానిక పరిధులకే పరిమితం కాకుండా..  ఈ వివాదాలు ఇటు సామాజిక శ్రేయస్సు, అటు రాజకీయ,  న్యాయ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసే జాతీయస్థాయి అంశాలుగా రూపాంతరం చెందాయి.  ఈ నేపథ్యంలో, దేశంలోని ప్రార్థనా స్థలాల రక్షణ కోసం ఉద్దేశించిన 1991 నాటి చట్టం   అసలు పరిధి ఏమిటనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఇరుపక్షాల వాదోపవాదాలు..  దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల ముందుకు వచ్చిన ఈ వివాదాలలో హిందూ, ముస్లిం వర్గాలు తమ తమ చారిత్రక ఆధారాలను, చట్టపరమైన హక్కులను బలంగా వినిపిస్తున్నాయి. కాశీలోని జ్ఞానవాపి ఆలయ సముదాయంలో నిత్యం పూజలు చేసుకునే హక్కును కల్పించాలని హిందూ పక్షం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అక్కడ ఒకప్పుడు సువిశాలమైన శివాలయం ఉండేదనీ.. దానిని కూల్చివేసి ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారనీ..  కనుక  ఆ భూమి   ప్రాచీన స్వభావం హిందూ మతానికే చెందుతుందని వారు కోర్టులలో వాదిస్తున్నారు. దీనిని ముస్లిం కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. శతాబ్దాలుగా తాము అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నామని..  1991 నాటి ప్రత్యేక చట్టం ప్రకారం ఏ ఒక్క ప్రార్థనా స్థల స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని అంటున్నారు.  అదే విధంగా..  మధురలోని సుమారు 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, అక్కడ ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని హిందూ పిటిషనర్లు సుదీర్ఘ న్యాయపోరాటం సాగిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలోనే ఇక్కడి ప్రాచీన ఆలయం ధ్వంసమైందని వారి ప్రధాన ఆరోపణ. అయితే..  ముస్లిం వర్గాల వాదన దీనికి భిన్నంగా ఉంది. గతంలో ఇరు వర్గాల మధ్య కుదిరిన శాంతియుత ఒప్పందాలను, ఇప్పటికే స్థిరపడిన భూయాజమాన్య పత్రాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత యథాతథ స్థితిని అలాగే కొనసాగించాలని వారు కోరుతున్నారు.  

సంభాల్, ఢిల్లీ,   జౌన్‌పూర్ఈ వివాదాలు కేవలం కాశీ, మధురలకే పరిమితం కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతానికి కూడా వ్యాపించాయి. అక్కడి చారిత్రక జామా మసీదు అసలైన హరిహర ఆలయమనీ..  దానిని కాలక్రమేణా మసీదుగా మార్చారని హిందూ సంఘాలు కోర్టు తలుపు తట్టాయి. కానీ, ఈ వాదనలను మసీదు కమిటీ పూర్తిగా తోసిపుచ్చుతోంది. ఈ కట్టడం మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ముందే ఉందనీ..  కేవలం కొన్ని కాలాల్లో చిన్నపాటి మరమ్మతులు మాత్రమే జరిగాయని   పేర్కొంటున్నది. ఇటువంటి తరహా వివాదాలే ఢిల్లీలోని సుప్రసిద్ధ జామా మసీదుతో పాటు జౌన్‌పూర్ పరిధిలోని అటాలా మసీదు విషయంలోనూ తెరపైకి వస్తున్నాయి. ప్రాచీన కట్టడాల పునాదుల కింద హిందూ ఆలయాల అవశేషాలు దాగి ఉన్నాయనేది ఒకరి వాదన కాగా..  ముగిసిపోయిన పాత మతపరమైన వివాదాలను మళ్లీ తవ్వి తీయడం   రాజ్యాంగ స్ఫూర్తికే గొడ్డలి పెట్టు అని మరొకరు అంటున్నారు.  

పూజా స్థలాల చట్టం, 1991,  మరియు ఏఎస్ఐ సర్వేలుఈ మొత్తం వివాదాల వెనుక ఉన్న అతిపెద్ద చట్టపరమైన అంశం  పూజా స్థలాల  ప్రత్యేక నిబంధనల  చట్టం 1991. నాటి ప్రధాని పీవీనరసింహారావు ప్రభుత్వం ఆమోదించిన ఈ చట్టం ప్రకారం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైన ఆగస్టు 15, 1947 నాటికి ఏ ప్రార్థనా స్థలానికి ఏ మతపరమైన గుర్తింపు లేదా స్వరూపం ఉందో..  దానిని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. అయితే నాటి అయోధ్య వివాదాన్ని మాత్రం ఈ చట్ట పరిధి నుండి మినహాయించారు.  ఇక్కడే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఒక సంక్లిష్టమైన ప్రశ్న తలెత్తింది. చట్టం ప్రకారం మతపరమైన స్వరూపాన్ని మార్చడం నిషేధమైనప్పుడు.. అసలు ఆయా వివాదాస్పద స్థలాల నిజమైన మతపరమైన స్వభావం  ఏమిటో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ   ద్వారా,  వైజ్ఞానిక,  శాస్త్రీయ సర్వేలను నిర్వహించడానికి కోర్టులు ఆదేశించవచ్చా లేదా? అనేదే ఆ ప్రశ్న. 

కొన్ని దిగువ న్యాయస్థానాలు,  హైకోర్టులు ఈ తరహా సర్వేలను అనుమతిస్తూ..  తాము చట్టాన్ని ఉల్లంఘించడం లేదనీ..  కేవలం చారిత్రక సత్యాన్ని మాత్రమే నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నామని అంటున్నాయి. కానీ..  ముస్లిం వర్గాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ విధమైన సర్వేలకు అనుమతులు ఇవ్వడం,  1991 చట్టం యొక్క మూల ఉద్దేశాన్ని బలహీనపరచడమేనని సుప్రీంకోర్టులో వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్లిష్టమైన  కేసులన్నీ దేశంలోని వివిధ కోర్టులలో విచారణ దశలో ఉన్నాయి.

 ఈ చట్టపరమైన వివాదాలు కేవలం కోర్టు గదులకే పరిమితం కాకుండా సమాజంలో తీవ్రమైన ఉద్వేగాలను, చర్చలను రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజా బాహుళ్యంలో రెండు స్పష్టమైన భిన్న కోణాలు కనిపిస్తున్నాయి. మొదటి వర్గం వాదన ప్రకారం, గతంలో విదేశీ దండయాత్రల వల్ల దేశీయ సంస్కృతిపై, స్థానిక అస్తిత్వంపై జరిగిన చారిత్రక తప్పిదాలను, అన్యాయాలను ప్రస్తుత చట్టబద్ధమైన మార్గాల ద్వారా సవరించుకోవాలి. శాస్త్రీయమైన ఆధారాల సేకరణ ద్వారా నిజాలను నిరూపించడం చట్టబద్ధంగా సరైనదేనని వీరు గట్టిగా నమ్ముతున్నారు.  

దీనికి భిన్నంగా.. రెండవ వర్గం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. శతాబ్దాల క్రితం ముగిసిపోయిన,  ఒక ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ కల్పించబడిన వివాదాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం వల్ల దేశంలో మత  సామరస్యం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మైనారిటీ వర్గాలలో ఒక రకమైన అభద్రతా భావాన్ని సృష్టిస్తుందని, తద్వారా దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి అత్యంత కీలకమైన ప్రజా శాంతికి విఘాతం కలుగుతుందని   హెచ్చరిస్తున్నారు.

 సుప్రీంకోర్టు తీర్పుపైనే  న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కేవలం సాధారణ భూ వివాదాల పరిష్కారాలుగా మాత్రమే కాకుండా, దేశ రాజ్యాంగ బద్ధతకు, చట్టబద్ధ పాలనకు అద్దం పట్టేలా ఉండాలి. రాబోయే రోజుల్లో 1991 నాటి పూజా స్థలాల చట్టం యొక్క పరిధి,  ఏఎస్ఐ సర్వేల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది వివరణే భారతదేశ సామాజిక-రాజకీయ భవిష్యత్తును, మత సామరస్య గమనాన్ని శాసించనుంది. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  


 

google-ad-img
    Related Sigment News
    • Loading...