Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డ్రగ్స్ కేసులో నా కుమారుడు నిర్దోషి : పుట్టా సుధాకర్
posted on: Mar 23, 2026 3:50PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన తండ్రి, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని, ఈ కేసులో అతడిని కావాలనే ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు.
తన కుమారుడు మహేష్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ.. 2021లో అతనికి మేజర్ హార్ట్ సర్జరీ జరిగిందని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. గుండెలో స్టంట్ కూడా వేశారని, అప్పట్లో వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారని గుర్తుచేశారు. పల్స్ రేటు 130-140 దాటితేనే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు హెచ్చరించిన తరుణంలో, ప్రాణాల మీదకు తెచ్చుకుని డ్రగ్స్ తీసుకునేంత మూర్ఖుడు తన కొడుకు కాదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా సుధాకర్ యాదవ్ పలు అనుమానాలను లేవనెత్తారు. సాధారణంగా బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు రావడానికి 48 గంటల సమయం పడుతుందని, కానీ మహేష్ విషయంలో పోలీసులు అంత త్వరగా ఫలితాలను ఎలా ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. తాము ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో శాంపిల్స్ ఇచ్చామని, అక్కడ కూడా రిపోర్టు రావడానికి సమయం పడుతుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.
యూరిన్ టెస్టుల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆయన విమర్శించారు. మొదటిసారి పరీక్ష చేసినప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఫలితం చెప్పారని, రెండోసారి మాత్రం 5 గంటల సమయం తీసుకున్నారని.. ఈ మధ్యలో ఏదో జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం సాధారణ మందులు వాడినా కొన్నిసార్లు డ్రగ్స్ పాజిటివ్ అని చూపిస్తుందని ఆక్స్‌ఫర్డ్ నివేదికలు చెబుతున్నాయని, వాటిని ఆధారం చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ అధిష్టానం స్పందన గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ పెద్దలకు తాము పూర్తి వివరాలను వివరించామని సుధాకర్ యాదవ్ తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని, అయితే వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ఆధారాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడి క్యారెక్టర్ గురించి ఏలూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసని, త్వరలోనే మహేష్ నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






