పురందేశ్వరికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కేనా?

posted on: May 24, 2014 9:22AM

 

మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికలకు ముందు బీజేపీలోకి మారి రాజంపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆమెకు మళ్ళీ కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె గతంలో యూపీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసి తన సమర్దతను నిరూపించుకొని అందరిచేత ప్రశంశలు అందుకొన్న ఆమెకు నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో ఆమెకు కూడా స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇదివరకు నిర్వహించిన మానవ వనరుల శాఖనే మళ్ళీ ఆమెకు కేటాయించవచ్చును. కానీ ఆమెను మంత్రి వర్గంలో చేర్చుకోదలిస్తే, ఆరు నెలల్లోగా ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయవలసి ఉంటుంది. ఇది పెద్ద అవరోధం కాకపోయినప్పటికీ, ఇదే ఆమెకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.

 

విశాఖ నుండి పోటీచేసి గెలిచిన బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు తదితరులు అనేకమంది కేంద్రమంత్రి పదవి రేసులో ఉండటం కూడా ఆమెకు మరో ప్రతిబందకం కానుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆమె కోరుకొన్న చోటు నుండి లోక్ సభ టికెట్ దక్కకుండా అడ్డుపడి ఆమె విజయావకాశాలకు గండికొట్టిన చంద్రబాబు, మరి ఇప్పుడు కూడా ఆమెకు మంత్రిపదవి దక్కకుండా అడ్డుపడినా ఆశ్చర్యం లేదు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుండి విజయావకాశాలున్న బీజేపీలోకి మారినప్పటికీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆమెకు ఎదురీత తప్పడంలేదు. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించి ఆమె మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకోగలరా లేదా అనేది త్వరలో తేలిపోతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...