పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ హతం

posted on: May 21, 2026 5:53PM

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్‌లో ఒకడైన హంజా బుర్హాన్ అలియాస్  డాక్టర్ హతమయ్యాడు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో  హంజా బుర్హాన్  అక్కడికక్కడే  మరణించాడు.  

హంజా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. పుల్వామా జిల్లా రత్నిపోరా ప్రాంతానికి చెందిన అతడు 2017లో ఉన్నత చదువుల కోసమంటూ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ  అల్-బదర్  లో చేరి కమాండర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత కశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, వారిని తీవ్రవాదులుగా మార్చడానికి దక్షిణ కశ్మీర్‌లో పెద్ద నెట్‌వర్క్ నడిపాడు.  2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులకు హంజా బుర్హాన్ పేలుడు పదార్థాలు, గ్రనేడ్లు సరఫరా చేసినట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి.

అంతే కాకుండా  2020లో జరిగిన మరో గ్రెనేడ్ దాడిలోనూ ఇతడి ప్రమేయం ఉంది. దీనిపై భారత హోంమంత్రిత్వ శాఖ 2022లోనే ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. గత రెండేళ్లుగా పాకిస్థాన్, పీఓకే పరిధిలో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల టాప్ కమాండర్లను గుర్తుతెలియని సాయుధులు టార్గెట్ చేసి మరీ హతమారుస్తున్నారు.  గత నెలలో  లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజా లాహోర్‌లో హతమవగా.. జైషే చీఫ్ మసూద్ అజార్ అన్న తాహిర్ అన్వర్ కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు తాజాగా పుల్వామా  దాడి మాస్టర్ మైండ్స్ లో ఒకడైన  హంజా బుర్హాన్  హతమయ్యాడు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...