మహా 'మేత' వల్లే డ్యామ్ గేటు కొట్టుకుపోయింది! 

posted on: Aug 6, 2021 2:20PM

పులిచింతల ప్రాజెక్టు గేటు ఎలా ఊడింది? నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయా? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల తప్పిదమా? ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. పులిచింతల డ్యామ్ గేటు ఊడిపోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఒక గేటు విరిగిపోయింది కాబట్టి ప్రమాదం తప్పింది.. అదే రెండు , మూడు గేట్లు విరిగిపడితే పరిస్థితి ఏంటన్నది ఊహించడానికి భయంగా ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర గండమే. వందలాది గ్రామాలు జల సమాధి కావాల్సిందే. ఇదే ఇప్పుడు కృష్ణా పరివాహాక ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. 

పులిచింతల ప్రాజెక్టులో విరిగిపోయిన గేటును అమర్చే పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రాజెక్టులో అధిక మొత్తంలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేవు., దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉండ‌గా, ఎగువ నుంచి లక్ష 67 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతోంది. పులిచింత‌ల డ్యామ్ వ‌ద్ద విరిగిన గేటు మరమ్మతు పనులు ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉందని అంటున్నారు. 

డ్యామ్ గేటు విరిగిపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగోలుగా కట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టు పనులు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదలయ్యాయి. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంపై మొదటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. భారీగా అవినీతి జరిగిందని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. నాసిరకంగా పనులు చేసి డబ్బులు కాజేశారని మండిపడ్డాయి. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో.. అప్పట్లో తాము భయపడినట్లే జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. జలయజ్ఞం పేరుతో జరిగిన మహా''మేత'' వల్లే పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు...సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు.. తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

పులిచింత‌ల డ్యామ్ 16వ నంబర్‌ గేటు విరిగిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌న‌సేన పార్టీ నేత నాందెడ్ల మ‌నోహ‌న్ అన్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ఎంత సుర‌క్షితంగా ఉందో గేట్ల నాణ్య‌త‌, వాటి ప‌ని తీరు ఆధారంగా ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌స్తార‌ని  అన్నారు. అలాంటిది జ‌ల ప్ర‌వాహం ధాటికి గేటు విరిగిపోవ‌డం, అందుకు సంబంధించి యాంక‌ర్ తెగిపోవ‌డం చూస్తుంటే ఆ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ అంశాల‌పై భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ ప్రాజెక్టు లోప‌భూయిష్టంగా ఉంద‌ని జ‌ల వ‌న‌రుల ఇంజ‌నీరింగ్ నిపుణులు మొద‌టి నుంచీ చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్ని వాస్త‌వ‌మ‌ని నాదేండ్ల అన్నారు. పులిచింత‌ల ప్రాజెక్టు ఏ మేర‌కు ప‌దిలం అన్న విష‌యాన్ని నిగ్గు తేల్చంతో పాటు లోపాలు ఎలా చ‌క్క‌దిద్దాల‌న్న విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయడానికి ఉన్న‌త‌స్థాయి నిపుణుల క‌మిటీని నియ‌మించాల‌ని నాదేండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...