Latest News
ట్రంప్ కు నిరసనల సెగ
posted on: Mar 29, 2026 9:38PM

అమెరికా అధ్యక్షుడికి ఆ దేశంలో నిరసనల సెగ తగిలింది. ట్రంప్ యుద్ధ కాంక్ష, దూకుడు రాజకీయాలు వంటి విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన జ్వాలలు ఎగస పడుతున్నాయి. ఒక్క అమెరికాలోనే కాకుండా ఐరోపా వ్యాప్తంగా కూడా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఐరోపాలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. నో కింగ్స్ పేరుతో చేపట్టిన ఈ ఉద్యమంలో 90 లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో నో కింగ్స్ నిరసనలు వ్యక్తం అయ్యాయి. నగరాలు, పట్టణాలూ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మొత్తంగా అమెరికాలో 3 వేల ప్రాంతాలలో నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్ వలస విధానాలు, ఇతర దేశాలపై యుద్ధ ప్రకటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
అమెరికా, లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లోనూ ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా అమెరికా నిర్ణయాలు ఉండకూడదని నినదించారు.
మునుపెన్నడూ లేని విధంగా జనం నో కింగ్స్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు చోటు లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రజా వ్యతిరేకతపై వైట్ హౌస్ స్పందన తెలియాల్సి ఉంది. నిరసనకారులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించడంతో ట్రంప్ తన విధానాలపై పునరాలోచన చేయక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందు ముందు ఈ నిరసనలు అన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉందంటున్నారు.



.webp)


